YS Sharmila Political Party: తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెడతానంటూ ముందుకు రావడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో షర్మిల పార్టీ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ పోశాల లోటస్‌పాండ్‌లో వైఎస్ షర్మిలను కలిశారు. ఆవిడతో భేటీ అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఇందిరా.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. ఓ మహిళగా, వైఎస్ షర్మిలకు మద్ధతుగా ఆమెను కలిశానని చెప్పుకొచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసే తత్వం తనది అని, ఇంకా పోరాడాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే అది సాధ్యమయ్యే పని కాదని ఇందిరా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతగానో శ్రమించానన్న ఆమె.. పార్టీలో తనకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాలు, ఉత్తమ్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని వివరించారు ఇందిరా శోభన్. పని చేసినపుడు పదవి అడగడంలో తప్పులేదని, అందుకే సీటు ఆశించానని ఆమె చెప్పుకొచ్చారు. సీటు ఇవ్వకపోగా కనీసం తనను పిలిచి ఎందుకు సీటు ఇవ్వలేదన్న కారణం కూడా చెప్పలేదన్నారు. ఓడిపోయిన వాళ్ళకే సీట్లు, పదవులు ఇస్తే ఇలాంటి పరిణామాలే చోటు చేసుకుంటాయని కాంగ్రెస్ పార్టీ తరుపై విమర్శలు గుప్పించారు ఇందిరా. కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్న ఆమె.. అందుకే ఆ పార్టీ ఎదగలేకపోతోందన్నారు.
వైఎస్ఆర్ పాలనలో స్వర్ణ యుగం నడిచిందన్న ఆమె.. తెలంగాణ లక్ష్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. మహిళలంతా షర్మిలకు మద్దతుగా నిలబడతామని ఇందిరా ప్రకటించారు. కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు అడ్డాగా మారిందని, ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఇక కేంద్రం అండ లేకుండా ఇక్కడ కేసీఆర్ ఆటలు కొనసాగవనని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని ఆరోపించారు. కులం, మతం, సర్జికల్ స్ట్రైక్స్ ద్వారానే బీజేపీలో ప్రజల్లోకి వెళ్తోందన్నారు. ప్రజా సమస్యలను అన్ని పార్టీలు గాలికి వదిలేసాయి కాబట్టి రాష్ట్రంలో మరో పార్టీ అనివార్యం అయ్యిందని ఇందిరా శోభన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల సాధనే తమ ప్రథమ పోరాటం అని షర్మిల చెప్పారని పేర్కొన్న ఇందిరా.. తన బాట కూడా అదే కావడంతో షర్మిలతో కలిసి నడవటానికి సిద్ధమయ్యానని చెప్పారు. వైఎస్ షర్మిల నుంచి తనకు ముందే ఆహ్వానం అందిందని ఆమె చెప్పారు. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్నానని, తమతో కలిసి నడవాలని కోరినట్లు ఇందిరా శోభన్ తెలిపారు. ఇదే సమయంలో ఆంధ్రాకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడంపై వస్తున్న ప్రశ్నలకు ఇందిరా శోభన్ తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. ‘ఎవరూ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగలేదు. పార్టీ పెట్టడానికి రాష్ట్ర భౌగోళిక పరిస్థితులు, ప్రజల స్థితిగతులపై అవగాహన ఉంటే చాలు’ అని చెప్పుకొచ్చారు.
Also read:
Covid Vaccination: కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రం కీలక నిర్ణయం.. దానిపై వున్న నియంత్రణ ఎత్తవేత