
అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీడబ్యూసీ భేటీతో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బీజేపీ-బీఆర్ఎస్ వైఫల్యాలు ప్రజల్లో చర్చకు వచ్చేలా చూస్తోంది. ఇందుకోసం ప్రణాళిక సిద్దం చేసిన కాంగ్రెస్.. ఆ రెండు పార్టీలపై ఛార్జ్‌షీట్ రిలీజ్ చేసింది. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆశిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అధికార బీఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టైమ్ దగ్గర పడుతుండటంతో ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది. వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ-బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను డోర్ టు డోర్ తీసుకెళ్లడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ రెండు పార్టీలు ఏం హామీలిచ్చాయి..? ఎన్ని నెరవేర్చారు..? అవన్నీ పాయింట్ టు పాయింట్ ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లబోతుంది. ఇందులో భాగంగా బీజేపీ-బీఆర్ఎస్ పై ఛార్జ్‌షీట్ రిలీజ్ చేసింది టి.కాంగ్రెస్. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు మర్చిపోయాయని.. వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రకటించింది.
గతంలో ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ.. బీఆర్‌ఎస్, బీజేపీ తోడుదొంగలంటూ కరపత్రాలు ప్రింట్ చేయించింది. కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు ఛార్జ్‌షీట్ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ తెలిపారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లో చర్చకు వచ్చేలా చేయాలని టి .కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు తుక్కుగూడ వేదికగా ఈనెల 17 నిర్వహించే విజయభేరి సభకు కాంగ్రెస్ సన్నాహాలను ముమ్మరం చేసింది. సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేతలు విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. ఇదే సభా వేదిక నుంచి కాంగ్రెస్ అగ్రనాయకత్వం…. ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. సోనియాగాంధీ హాజరవుతున్న ఈ సభ సాక్షిగా… కీలకమైన హామీలను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ సభను విజయవంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల వేళ…. సీడబ్యూసీ భేటీతో పాటు విజయభేరి సభతో తెలంగాణ ప్రజలకు స్పష్టమైన సందేశాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీజేపీ, బీఆర్ఎస్ విధానాలపై అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..