Uttam Kumar Reddy on CM KCR: తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టేశారని కాంగ్రెస్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. 8 ఏళ్లలో 3లక్షల 12వేల కోట్ల రూపాయల అప్పులు చేశారంటూ మండిపడ్డారు. ఇంత అప్పు చేసినా తెలంగాణ మాత్రం డెవలప్ కాలేదంటూ ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో తెలంగాణలో ప్రతి వ్యక్తిపై లక్ష రూపాయల రుణభారం ఉందన్నారు. శ్రీలంక పరిస్థితి… తెలంగాణ ప్రజలకు రావొద్దనే అప్పుల లెక్కలను బయటపెడుతున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. లోకసభలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలు వ్రాతపూర్వకంగా వాటి వివరాలను ఆర్ధిక శాఖ సోమవారం విడుదల చేసింది. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్బీఐ నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అప్పు రూ. 3,12,191.3 కోట్లు ఉన్నట్లు తెలిపారు. కొన్ని ప్రాజెక్టులకు అవసరానికి మంచి ఖర్చు పెడుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు.
2018లో రూ. 1.6 కోట్లు, 2019 రూ.1.9 లక్షల కోట్లు, 2020లో రూ. 2.5 లక్షల కోట్లు, 2020లో రూ. 2.7 లక్షల కోట్లు, 2022లో రూ. 2.12 లక్షల కోట్ల అప్పు చేశారని వివరించారు. మొత్తం 3,12,191.3 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు ఉత్తమ్ తెలిపారు. 2014లో ప్రతి మనిషి మీద రూ. 18,000 వేల అప్పు ఉంటే.. 2022 నాటికి ప్రతి మనిషి తలసరి అప్పు రూ.లక్షపైనే ఉందని.. ఐదు రెట్లు పెరిగిందని తెలిపారు. కార్పొరేషన్ అప్పులను FRBMలో చూపించట్లేదని.. వాటిని FRBMలోకి తీసుకొస్తామని ఆర్ధిక మంత్రి చెప్పినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కంటే పెద్దగా ఉన్న రాష్ట్రాలు కూడా ఇంత అప్పులు చేయలేదంటూ ఉత్తమ్ మండిపడ్డారు.
అప్పులు తీసుకొచ్చి లాభాలు చూపించుకుంటున్నారని.. కార్పొరేషన్ ద్వారా డబ్బులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జీతాలు కూడా ఇవ్వని పరిస్థితిలో రాష్ట్రం ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావట్లేదని.. మహిళల పథకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించిన డబ్బులు విడుదల చేయట్లేదని పేర్కొన్నారు. ఈ విషయంపై స్వయంగా విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా హెచ్చరించారని పేర్కొన్నారు. అడ్డగోలుగా అప్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని.. కేంద్రం దీనికి అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ సూచించారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..