Congress Tractor Rally: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు నల్లగొండ జిల్లాలోని హాలియాలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. దాదాపు 300 ట్రాక్టర్లతో అనుముల ప్రభుత్వ ఐటీఐ కాలేజీ నుంచి మిర్యాలగూడు రోడ్డు, సాగర్ రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో క్రాంగెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జానారెడ్డి.. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు నష్టాలే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చలి, వాన, ఎండ అని తేడా లేకుండా రైతులు రోడ్ల మీదకు వచ్చి రెండు నెలలుగా ఆందోళనలు చేస్తుంటే కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రైతులందరికీ సంఘీభావంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు జానారెడ్డి పేర్కొన్నారు. ఇదే సమయంలో గణతంత్ర దినోత్సవం రోజుల రైతు ఉద్యమంలో జరిగిన అల్లర్లపై ఆయన స్పందించారు. రైతుల ముసుగులొ కొందరు అరాచక శక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఆయన ఆరోపించారు. ఇకనైనా కేంద్రం స్పందించి రైతులకు మేలు చేసేలా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Also read:
Farmers Protest: జైజవాన్, జైకిసాన్ నినాదాలతో, ఢిల్లీ బోర్డర్లలోకి మళ్ళీ చేరుతున్న అన్నదాతలు.