Congress Focus on Council: సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్.. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందా..!

|

Jul 09, 2024 | 1:26 PM

తెలంగాణ చట్టసభల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ.. అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ సెషన్స్‌కు ముందే శాసనమండలిలో తిరుగులేని పార్టీగా అవతరించాలని చూస్తోంది హస్తం పార్టీ.

Congress Focus on Council: సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్కెచ్.. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనం అవుతుందా..!
Telangana Council Members
Follow us on

తెలంగాణ చట్టసభల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఒకవైపు ఎమ్మెల్యేలు, మరోవైపు ఎమ్మెల్సీలను చేర్చుకుంటూ.. అసెంబ్లీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగులు వేస్తోంది. వచ్చే అసెంబ్లీ సెషన్స్‌కు ముందే శాసనమండలిలో తిరుగులేని పార్టీగా అవతరించాలని చూస్తోంది హస్తం పార్టీ.

తెలంగాణ శాసనమండలిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి సీరియస్‌గా అమలు చేస్తున్న కాంగ్రెస్.. అసెంబ్లీ సమావేశాల్లోపు బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకునేందుకు సీఎం రేవంత్ కసరత్తు ముమ్మరం చేశారు. అటు మండలిపై కూడా గురిపెట్టి.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్సీలను వరుసగా చేర్చుకుంటున్నారు. మెల్లగా మండలిలో బలం పెంచుకుంటున్నారు.

మండలిలో గవర్నర్ కోటా రెండు ఖాళీలుండగా.. ప్రస్తుతం 39మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్‌కు 19మంది, కాంగ్రెస్‌కు 13మంది, బీజేపీ 1, ఎంఐఎం 2, స్వతంత్రులు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంపీ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ బలం ఐదుగురు ఎమ్మెల్సీలే. ఎంపీ ఎన్నికల సమయంలో పట్నం చేరికతో అది ఆరుకు చేరింది. ఇటీవల ఒకేసారి ఆరుగురి చేరికతో.. కాంగ్రెస్ బలం 12కు పెరిగింది. తాజాగా చల్లా వెంకట్రామిరెడ్డి సీఎంను కలవడంతో ఆయన చేరిక కూడా లాంఛనమే అని తెలుస్తోంది. దీంతో మండలిలో కాంగ్రెస్ బలం 13కు చేరింది. బీఆర్‌ఎస్‌కు చెందిన చాలామంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. త‌మ‌కు నెక్ట్స్ ట‌ర్మ్ రెన్యూవ‌ల్ చేస్తే చేరేందుకు రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ పాల‌సీ ప్రకారం ముందే హామీ ఇవ్వలేమ‌ని పార్టీలో చేరితే మాత్రం సముచిత స్థానం క‌ల్పిస్తామ‌ని ముఖ్యనేత‌లు భరోసా ఇస్తున్నారు.

మండలిలో 2/3 మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయొచ్చు అనే భావనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరో 9 మంది MLCలని పార్టీలోకి ఆకర్షించి 2/3 మెజారిటీ కంప్లీట్ చేసే యోచనలో ఉంది కాంగ్రెస్. పెద్దల సభలో బలం పెంచుకుని.. హస్తగతం చేసుకోవాలని.. కాంగ్రెస్ భావిస్తోంది. అంతేకాదు భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకొచ్చే కీల‌క బిల్లుల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే మండ‌లిలో మెజారిటీ చాలా అవసరం. సో.. ఎమ్మెల్సీలతో మాట్లాడే బాధ్యతను సీఎం రేవంత్ పలువురు మంత్రులకు అప్పచెప్పినట్టు తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి మండలి విషయంలో వేగంగా అడుగులు వేయడానికి కారణాలు లేకపోలేదు. తాను ప్రత్యక్షంగా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. తన కొడుకు అమిత్ రెడ్డి రాజకీయ భవిషత్తు కోసం కాంగ్రేస్ పార్టీలో చేర్పించి కేసీఆర్ కు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో బీఆర్ఎస్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే అసెంబ్లీ సెషన్స్‌కు ముందే మెజార్టీ ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆషాడానికి ముందే టాస్క్‌ పూర్తి చెయ్యాలని, బీఆర్ఎస్ వైఫల్యాలు వారితోనే చెప్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కొన్నిచోట్ల చేరికలను స్వాగతిస్తుంటే, మరికొన్ని చోట్ల వ్యతిరేకత వినిపిస్తోంది. ఇక ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీకి ఏ మేర‌కు కలిసి వస్తాయో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…