తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఉన్న వివాదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. గణతంత్ర వేడుకల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయమే ఇందుకు కారణమని రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించకూడదని సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక రాజ్ భవన్‌లోనే వేడుకలను జరుపుకోవాలని గవర్నర్‌కు లేఖ ద్వారా ప్రభుత్వం సూచించింది. దీంతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతీ రాష్ట్రంలో ఘనంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్న తరుణంలో మన రాష్ట్రంలో వేడుకలు జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు తమిళిసై. ఇంకా పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ స్థాయిలో రిపబ్లిక్ డే జరుపుకోక పోవడం, తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయమే అని అభిప్రాయపడ్డారు గవర్నర్.
ఈ క్రమంలోనే ‘ఖమ్మంలో 5 లక్షల మందితో బహిరంగ సభ నిర్వహిస్తే లేని కోవిడ్, పరేడ్ గ్రౌండ్స్‌లో రిపబ్లిక్ డే జరిపితే వస్తుందా..?’ అని ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఫలితంగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య సంబంధాలు మరింత బలహీనపడినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే గతేడాది డిసెంబర్ చివరి వారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మాటలు కలిపారు. రాష్ట్రపతి తెలంగాణకు వచ్చిన రోజు రాజ్ భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విడిదికి సీఎం కేసీఆర్ రాకపోయినా.. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య వివాదాలు సమసిపోయాయి.. క్రమంగా శాంతి వికసిస్తోందని అంతా భావించారు.
ఇక ఇప్పుడు ప్రభుత్వం, గవర్నర్ మధ్య గణతంత్ర వేడుకల నేపథ్యంలో వివాదం నెలకొంది. మరి ఈ పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని గవర్నర్ భావిస్తున్నట్లు రాజ్ భవన్ వర్గాల సమాచారం. ఇంకా రాజ్ భవన్‌లో త్రివర్ణ పతాకం ఎగరవేసిన తర్వాత సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లి అక్కడ రిపబ్లిక్ డే వేడుకలలో పాల్గొననున్నారు డాక్టర్ తమిళిసై. కాగా గతేడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలను రాజ్‌భవన్‌కే పరిమితంచేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం