బీఆర్ఎస్ పని అయిపోయింది.. కొత్త పార్టీకి తావులేదు.. ఇక కాళేశ్వరం లెక్కలు తేలుస్తాం: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మీడియా చిట్‌చాట్‌లో భాగంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కీలక విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతోందని ఆయన జోస్యం చెప్పారు.

బీఆర్ఎస్ పని అయిపోయింది.. కొత్త పార్టీకి తావులేదు.. ఇక కాళేశ్వరం లెక్కలు తేలుస్తాం: రేవంత్ రెడ్డి
Cm Revan Reddy On Kcr Family

Updated on: Apr 28, 2026 | 8:33 AM

తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. మీడియా చిట్‌చాట్‌లో భాగంగా ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కీలక విమర్శలు చేశారు. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం నుంచి బీఆర్ఎస్ కనుమరుగవుతోందని ఆయన జోస్యం చెప్పారు.

కవిత కొత్త పార్టీ పెడతారనే ప్రచారాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రాష్ట్రంలో కొత్త పార్టీకి అసలు తావే లేదు. ఉన్న పార్టీ (బీఆర్ఎస్) ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది” అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ను ఒక చనిపోయిన శవంతో పోల్చిన ఆయన, శవానికి ఎన్ని అలంకారాలు చేసినా తిరిగి ప్రాణం రాదని, ఆ పార్టీకి మనుగడ లేదని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ, తన రాజకీయ ప్రత్యర్థి ఆరోగ్యంగా ఉండాలనే తాను కోరుకుంటానని రేవంత్ అన్నారు. అయితే, కేసీఆర్ కుటుంబ సభ్యులే ఆయన మరణాన్ని కోరుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను విస్మరించడం వల్లే వారు ఓడిపోయారని విమర్శించారు. వారసత్వ సంపద, పదవుల కోసమే ఆ కుటుంబంలో ఆరాటం మొదలైందని, కేసీఆర్ తనకు కేవలం రాజకీయ ప్రత్యర్థి మాత్రమే తప్ప వ్యక్తిగత శత్రువు కాదని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కోర్టు తీర్పు విషయంలో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకోవడాన్ని రేవంత్ తప్పుబట్టారు. విచారణ కమిషన్ నియామకం చట్టబద్ధమేనని, జీవోను కొట్టేయలేమని కోర్టు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. కేవలం సెక్షన్ 8B, 8C ప్రకారం ప్రస్తుతం చర్యలు తీసుకోవద్దని మాత్రమే కోర్టు ఆదేశించిందని, ఇది ప్రభుత్వ విజయమని రేవంత్ అభివర్ణించారు. కాళేశ్వరంపై తక్షణమే సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

మొత్తానికి, రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు అటు కేసీఆర్ కుటుంబాన్ని డిఫెన్స్‌లో పడేయడంతో పాటు, కాళేశ్వరం అంశంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us