CM Revanth Reddy Delhi Tour: హస్తినలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. అధిష్టానం పెద్దలతో భేటీ అందుకోసమేనా?

| Edited By: Balaraju Goud

Jun 25, 2024 | 8:32 AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే లోక్‌సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఇంతకాలం పాటు పాలన కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది.

CM Revanth Reddy Delhi Tour:  హస్తినలో సీఎం రేవంత్ బిజీ బిజీ.. అధిష్టానం పెద్దలతో భేటీ అందుకోసమేనా?
Cm Revanth Reddy Delhi Tour
Follow us on

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే లోక్‌సభ ఎన్నికల హడావుడి ప్రారంభం కావడంతో ఇంతకాలం పాటు పాలన కంటే రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల హడావుడి ముగిసిన నేపథ్యంలో ఇక పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాలి అనుకుంటున్న సమయంలో రాజకీయాలు ఆయన్ను వీడడం లేదు. బీఆర్ఎస్ పార్టీ వీడి వస్తున్న ఎమ్మెల్యేల చేరికలు సహా నామినేటెడ్ పదవుల భర్తీ, కేబినెట్ విస్తరణ, రాష్ట్ర పీసీసీ అధ్యక్ష మార్పు వంటి ఇంకా చాలా అంశాలు ప్రస్తుతం తెరపై ఉన్నాయి.

ఢిల్లీ పర్యటనలో పాలనాపరమైన అంశాలతో పాటు ఈ రాజకీయాంశాల్లో స్పష్టత తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందులో భాగంగా తొలి రోజు ఇద్దరు కేంద్ర మంత్రులను కలిసి అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు, కేంద్ర ప్రాయోజిత పథకాల గురించి చర్చించారు. అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డిని ఏఐసీసీ కార్యాలయానికి తన వెంట తీసుకెళ్లిన రేవంత్, అధిష్టానం పెద్దలు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌‌తో సమావేశమయ్యారు. రెండో రోజు పర్యటనలో లోక్‍‌సభలో జరిగే తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావడంతో పాటు అధిష్టానం పెద్దలతో వివిధ అంశాలపై చర్చించనున్నారు.

లోక్‌సభ ఎంపీల ప్రమాణ స్వీకారం:

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక కోసం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. దేశంలో మొత్తం 543 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం కోసం 2 రోజుల సమయం కేటాయించారు. తొలి రోజు ప్రధాన మంత్రి సహా కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారితో పాటు అక్షర క్రమంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎంపీలు కలిపి తొలి రోజు 262 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం అక్షర క్రమంలో రెండో రోజు జాబితాలో ఉంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 8 కాంగ్రెస్, 8 బీజేపీ, 1 ఎంఐఎం గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీల ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్ హాజరుకానున్నారు. లోక్‌సభ గ్యాలరీలో కూర్చుని ఈ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు.

పార్టీలో చేరికలు – అలకలు:

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యా బలం కంటే కేవలం 4 స్థానాలు మాత్రమే అదనంగా గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, తమ ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది తేడాతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రాష్ట్రాల్లో బీజేపీ “ఆపరేషన్ లోటస్” చేపట్టి ప్రభుత్వాలను తారుమారు చేసిన ఉదంతాలు ఉన్నాయి. తెలంగాణలోనూ అదే మాదిరిగా రేవంత్ సర్కారును కూల్చేందుకు ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. అందుకే రేవంత్ రెడ్డి బీజేపీ ఆపరేషన్ చేపట్టడం కంటే ముందే తనదైన ఆపరేషన్ మొదలు పెట్టారు. ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం లేకుండా చూసుకుంటున్నారు. ఇందుకోసం బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలపై ఆకర్ష్ వల విసురుతున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను చేర్చుకుని సికింద్రాబాద్ లోక్‌సభ బరిలో దించిన రేవంత్ రెడ్డి, ఎన్నికలు ముగిసిన వెంటనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. వారిలో ఒకరైన పోచారం శ్రీనివాస రెడ్డిని తన వెంట తీసుకొచ్చి అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యారు. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిని ఓడించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను కూడా పార్టీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. ఈ చేరికను జీవన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తూ అలకబూనారు. మరో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చర్చ జరుగుతోంది.

మొత్తంగా ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకునే క్రమంలో చేపట్టిన ఆపరేషన్ స్థానికంగా ఎంతోకాలం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన రేవంత్ రెడ్డి, తాను చేపట్టే ప్రతి చర్యను అధిష్టానం పెద్దల ఆశీస్సులతోనే చేస్తున్నారు. సుస్థిరంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి, మరోసారి గెలుపొందడం కోసం వ్యూహాలు రచిస్తున్నారు.

పీసీసీ అధ్యక్ష మార్పు:

తెలంగాణ కాంగ్రెస్ రథసారథిగా గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించిన రేవంత్ రెడ్డి, ఇప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సాధారణంగా ఏ పార్టీలోనైనా సరే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి లేదా కేంద్ర మంత్రి వంటి పదవుల్లోకి వెళ్తే.. రాష్ట్ర అధ్యక్ష పదవిని మరొకరికి అప్పగిస్తారు. అయితే రేవంత్ సీఎం అయిన మరుక్షణమే లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలవడంతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకే కొనసాగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఇక రాష్ట్ర పీసీసీ అధ్యక్ష మార్పు అనివార్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో సమన్వయం చేసుకుంటూ పార్టీని నడిపించగల నేత కోసం అధిష్టానం అన్వేషిస్తోంది. పీసీసీ అధ్యక్ష రేసులో పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. అధిష్టానం ఎవరి వైపు మొగ్గుచూపుతుందనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. సీఎంతో తలపడకుండా కలసికట్టుగా, ఐకమత్యంతో పనిచేసే నేతకు పీసీసీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది. అలాగే సీఎం రేవంత్ అగ్రవర్ణాలకు చెందిన నేత కావడంతో, పీసీసీ అధ్యక్ష బాధ్యతల్ని బీసీలు లేదా ఇతర నిమ్నవర్గాల నేతలకు అప్పగించే అవకాశాలున్నాయి.

నామినేటెడ్ పదవులు:

పదవులు పదైతే, ఆశావహులు వెయ్యి అన్నట్టుగా ఉంది తెలంగాణలో నామినేటెడ్ పదవుల వ్యవహారం. అటు అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు టికెట్లు ఆశించి భంగపడ్డ అనేక మంది నేతలతో పాటు పార్టీ కోసం ఎంతోకాలంగా సేవలు అందిస్తున్న నేతల వరకు చాలా మంది నామినేటెడ్ పదవుల కోసం ఎదురుచూస్తున్నారు. వివిధ సమీకరణాల కారణంగా టికెట్ దక్కించుకోలేకపోయిన నేతలకు ఎమ్మెల్సీ పదవో, లేక నామినేటెడ్ పదవో ఇస్తామంటూ సీఎం రేవంత్ సహా అధిష్టానం పెద్దలు కూడా హామీలు ఇచ్చారు. అలాంటి వారిలో అద్దంకి దయాకర్ సహా ఇంకా చాలా మంది ఉన్నారు. వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లు వంటి పదవులతో నేతలను సంతృప్తి పరచాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అయితే పదవుల సంఖ్యకు పది రెట్ల ఆశావహులు ఉండడమే ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఈ అంశానికి కూడా ప్రాముఖ్యత ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…