
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమంటున్నారు బీజేపీ నేతలు. మూడు కోట్ల హిందు దేవతలున్నారని ఒక్కొక్కరు ఒక్కో ఓదేవుడిని నమ్ముతారని, అన్ని రకాల దేవుళ్లు ఉన్నట్టే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల వ్యక్తులు ఉన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. దేవుళ్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. బుధవారం (డిసెంబర్ 03) నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది భారతీయ జనతా పార్టీ. అసలు రేవంత్ ఏమన్నారు..? బీజేపీ నేతల అభ్యంతరం ఏంటి..?
హిందు దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలంగాణ BJP చీఫ్ రాంచందర్ రావు అన్నారు. హిందువులు మూడు కోట్ల మంది దేవుళ్ళను పూజిస్తారని, ఇంత మంది దేవుళ్లు ఉన్నారా? అని రేవంత్ మాట్లాడుతున్నారని రాంచందర్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌కి మజ్లీస్ పార్టీ దేవుళ్ళను విమర్శించే దమ్ముందా? ప్రశ్నించారు రాంచందర్‌రావు.
హిందువులకు సంబంధించిన దేవీదేవతలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఒక హిందువుగా ఉంటూ, హిందువుల మీద, దేవీదేవతల మీద రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. MIM సహవాస దోషం వల్లే రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. ఏ ఓట్లతో అయితే రేవంత్‌రెడ్డి అధికార పీఠమెక్కి మాట్లాడుతున్నారో..అదే ఓట్లతో కాంగ్రెస్ పార్టీకి బుద్దిచెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ముమ్మాటికీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాసే పార్టీ అని ఆరోపించారు. ముస్లిం అంటేనే కాంగ్రెస్..కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ అని రేవంత్ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. బీజేపీ ఏనాడూ ఇతర మతాలను కించపర్చలేదని..కించపర్చే ఉద్దేశమూ బీజేపీకి లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందని.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్” దిశగా పనిచేస్తోందని చెప్పారు.
ఎంఐఎం పార్టీ ఆదేశాల మేరకు రేవంత్‌రెడ్డి హిందూదేవుళ్లను కించపరిచేలా మాట్లాడుతున్నారా..? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఒవైసీ బ్రదర్స్‌తో సీక్రెట్ మీటింగ్ జరిగిందా అని నిలదీశారు. తెలంగాణ అభివృద్ధి గురించి, అభివృద్ధి ప్రణాళికల గురించి మాట్లాడాలి తప్ప..హిందూదేవుళ్ల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని రాజాసింగ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీజేపీ. హైదరాబాద్‌లో యువమోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరగనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..