Telangana: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. సీఎం రేవంత్ చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదే

|

Feb 09, 2024 | 10:04 PM

మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈసారి కొన్నింటిని అమలు చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇవ్వబోతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. తమ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల్లో కొన్నింటికి చోటు కల్పించింది. అలానే..

Telangana: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.. సీఎం రేవంత్ చెప్పబోయే గుడ్ న్యూస్ ఇదే
CM Revanth
Follow us on

శనివారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ సర్కార్‌ బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ నెల 12న బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ఈసారి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క పద్దు ఎలా ఉంటుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి శుభవార్త చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ…తెలంగాణలో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న బడ్జెట్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, అది ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు. సీఎం రేవంత్‌ మార్క్‌ కూడా ఈ బడ్జెట్‌లో కనిపిస్తుందంటున్నారు. వాస్తవ రాబడులు, వ్యయాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన జరిగింది. కాంగ్రెస్‌…తమ ప్రాధమ్యాల ప్రకారం బడ్జెట్‌ను రూపొందించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయనున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు 10 కోట్ల రూపాయలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కసరత్తును కూడా ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పూర్తి చేసినట్టు సమాచారం. మొత్తం 119 నియోజకవర్గాలకు 1190 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో అన్ని నియోజకవర్గాలకు ఎప్పుడూ బడ్జ్‌ట్‌లో నిధులను కేటాయించలేదు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఒక్కో చోట విద్యారంగ అభివృద్ధికి రెండు కోట్ల రూపాయలు, తాగునీటి సౌకర్యాల కల్పనకు కోటి రూపాయలను కేటాయిస్తారని చెబుతున్నారు.

మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలను అమలు చేయడం సాధ్యం కాదని, ఈసారి కొన్నింటిని అమలు చేస్తామంటూ ప్రజలకు భరోసా ఇవ్వబోతోంది కాంగ్రెస్‌ సర్కార్‌. తమ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల్లో కొన్నింటికి చోటు కల్పించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌ అందజేత వంటి గ్యారంటీలను అమలు చేయడానికి వీలుగా బడ్జెట్‌లో నిధులను కేటాయించినట్లు తెలిసింది. కల్యాణమస్తు పథకం కింద రూ.1,00,116 నగదును అందిస్తూనే.. తులం బంగారాన్ని కూడా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవలే ప్రకటించారు. అంటే.. ఒక్కొక్క లబ్ధిదారుకు దాదాపు రూ.1.70లక్షలను వెచ్చించాల్సి ఉంటుంది. వివిధ శాఖలు అందజేసిన బడ్జెట్‌ ప్రతిపాదనలను కూడా పక్కాగా లెక్కించి, పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతిపాదించే బడ్జెట్‌ 100 శాతం వ్యయమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..