Revanth Reddy: ఇకపై జిల్లాల్లోనూ హైడ్రా.. ఎవరినీ వదిలిపెట్టం: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

|

Sep 03, 2024 | 10:00 PM

రాష్ట్రంలో ఆక్రమణలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. అలాంటి వ్యవస్థతోనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు.

Revanth Reddy: ఇకపై జిల్లాల్లోనూ హైడ్రా.. ఎవరినీ వదిలిపెట్టం: సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Follow us on

వరుసగా రెండోరోజు సీఎం రేవంత్‌ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలిస్తున్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో వరద బాధిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి… ఇవాళ మహబూబాబాద్‌ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఖమ్మం నుంచి రోడ్డుమార్గం ద్వారా మహబూబాబాద్‌ చేరుకున్న సీఎం… సీతారాం తండాలో వరద బీభత్సాన్ని కళ్లారా చూశారు. కొట్టుకుపోయిన రహదారులను పరిశీలించారు. అనంతరం పురుషోత్తమయ్యగూడెం చేరుకున్న రేవంత్‌ బృందం.. అక్కడ నీటమునిగిన పంట పొలాలను పరిశీలించారు. జరిగిన నష్టంపై వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వరద బాధితులతో మాట్లాడిన సీఎం రేవంత్‌.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లాలో వరద నష్టంపై, మహబూబాబాద్‌ కలెక్టరేట్‌లో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఎక్కడికక్కడ వరద సమస్యలు పరిష్కరించేలా.. కలెక్టర్లకు, ఇంచార్జ్ మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. వరదలతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు దెబ్బతిన్నాయని.. ప్రాణనష్టం తగ్గించగలిగామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీస్‌ అధికారులను అభినందిస్తున్నానని తెలిపారు.  వరద బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతాయని.. 30 వేల ఎకరాల్లో పంటనష్టం జరిగినట్టు అంచనా అందిందన్నారు.

వీడియో చూడండి..

కాగా.. రాష్ట్రంలో ఆక్రమణలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చెరువులపై స్పెషల్‌ డ్రైవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తామన్నారు. అలాంటి వ్యవస్థతోనే కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు సూచించారు. ఎవరెన్ని మాట్లాడినా ఆక్రమణలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిందేన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుందన్నారు. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యమని.. చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవు అంటూ హెచ్చరించారు. నాలాల ఆక్రమణలను ఉపేక్షించేదిలేదని.. కబ్జాలు, ఆక్రమణలు చేసేవారు ఎంతటివారైనా వదిలేదిలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..