Revanth Reddy – Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..

|

Dec 13, 2024 | 6:52 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కేంద్రమంత్రులను కలిసి సీఎం.. ఇవాళ మరికొందరిని భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు చేయనున్నారు. అటు ఏఐసీసీ పెద్దలతో సీఎం సమావేశం తర్వాత.. మంత్రి వర్గ విస్తరణపై కీలక అప్‌డేట్ రానుంది.

Revanth Reddy - Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. ఎందుకంటే..
Revanth Reddy - Kishan Reddy
Follow us on

ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలను కలిసే పనిలో ముఖ్యమంత్రి బిజీబిజీగా ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ పెద్దలతో కీలక భేటీ జరగనుంది. మరోవైపు రాష్ట్రంలో పలుప్రాజెక్టుల కోసం నిధుల మంజూరు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రులను కోరనున్నారు. ఇప్పటికే గురువారం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రదాన్‌తో భేటీ అయ్యారు సీఎం రేవంత్‌. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు అవసరమైన టెక్నికల్‌, ఎకనామికల్‌ క్లియరెన్స్‌లు వెంటనే ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, పార్టీ ఎంపీలతో కలిసి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన సీఎం రేవంత్‌. హైద‌రాబాద్‌-శ్రీ‌శైలం ఎలివేటెడ్ కారిడార్, హైద‌రాబాద్‌-విజ‌య‌వాడ ఆరులైన్ల విస్తర‌ణ డీపీఆర్ ఆమోదించాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పలు నేషనల్ హైవేలకు నిధులు కేటాయించాలని.. కొన్ని రోడ్ల అలైన్‌మెంట్‌ మార్చాలని విజ్ఞప్తి చేశారు. పలు ప్రాజెక్టు వద్ద రోప్‌ వేలు ఏర్పాటు చేయాలని కోరారు.

కీలక విషయాల ప్రస్తావన..

కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో భేటీలో సీఎం రేవంత్ కీలక విషయాలను ప్రస్తావించారు.. రీజినల్ రింగ్ రోడ్ మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం, రేడియల్ రోడ్లు, మెట్రో ఫేజ్ – 2, మూసీ రివర్ ఫ్రంట్ కు కేంద్ర సహాయం, మూసీ – గోదావరి నదుల అనుసంధానం, హైదరాబాద్ సీవరేజీ మాస్టర్ ప్లాన్, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి చేయూత, సింగరేణికి గనుల కేటాయింపు చేయాలని కోరినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

నవోదయాల విషయంలో ప్రదాన్‌కి సీఎం కృతజ్ఞతలు

మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో భేటీ అయిన సీఎం రేవంత్‌ రెడ్డి.. రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. శాలువాలతో సత్కరించారు. నవోదయ విద్యాలయాలు లేని ఇతర జిల్లాలకు కూడా కేటాయించాలని, అలాగే తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇక కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కిషన్‌రెడ్డి నివాసంలో కలిసారు సీఎం. తెలంగాణలో వివిధ ర‌కాల అభివృద్ధి ప‌నుల‌కు కేంద్ర ప్రభుత్వం మ‌ద్దతు ఇచ్చేందుకు కృషి చేయాల‌ని కిష‌న్ రెడ్డికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్ఆర్ఆర్‌, హైద‌రాబాద్ మెట్రో ఫేజ్ 2 తోపాటు హైద‌రాబాద్, వ‌రంగ‌ల్‌ల్లో సీవ‌రేజీ, అండ‌ర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్లాన్‌… సింగ‌రేణి సంస్థకు బొగ్గు గ‌నుల కేటాయింపు స‌హా ప‌లు అంశాల‌పై కిషన్‌రెడ్డితో సీఎం చ‌ర్చించారు. లక్షా 63వేల 559 కోట్ల విలువైన ప్రాజెక్టుల విష‌యంలో కేంద్రం నుంచి కావ‌ల్సిన చేయూత‌పై కిషన్‌రెడ్డితో రేవంత్‌ చ‌ర్చించారు.

రేవంత్‌ ఢిల్లీ టూర్‌పై తెలంగాణ నేతల్లో ఆశలు

ఇవాళ ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్‌ కలవనున్నారు. కేబినెట్ విస్తరణపై చర్చించనున్నారు. ఈసారి ఢిల్లీ టూర్‌లో మంత్రివర్గ విస్తరణ అంశం ఫైనల్ కాబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులు గుడ్ న్యూస్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా కేబినెట్‌లో చోటు కోసం అధిష్టానం పెద్దల చుట్టూ ఆశావహలు చక్కర్లు కొడుతున్నారు. వివిద కోటాల్లో మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మంత్రివర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరో బాంబ్ పేల్చారు. ఈనెలాఖరులోగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..