Telangana: రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ

డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు.

Telangana: రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రజా పాలన-విజయోత్సవాల పేరుతో రాష్ట్రమంతా పండుగ
Revanth Reddy
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 15, 2024 | 7:08 AM

రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజా విజయోత్సవాలకు రంగం సిద్దం చేసింది. రాష్ట్రమంతా పండుగ వాతావరణంలో విజయోత్సవాలను నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

వచ్చే నెల 7వ తేదీకి రేవంత్‌ సర్కారు ఏర్పడి ఏడాది కావొస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రజా పాలన – విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఈమేరకు ప్రజాపాలన- విజయోత్సవాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. ప్రజాపాలన-విజయోత్సవాల్లో శాఖలవారీగా, విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్‌రెడ్డి.

సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం ఆదేశించారు. ఈసందర్భంగా డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు వివరించారు అధికారులు. ఈ నెల 19న వరంగల్‌ వేదికగా.. 22 జిల్లాల్లో ఇందిరా మహిళాశక్తి భవనాలకు శంకుస్థాపన చేస్తారు. విజయోత్సవాల్లో భాగంగా వరంగల్‌, కరీంనగర్‌.. మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఎం రేవంత్‌ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇక డిసెంబర్‌ 7,8,9 తేదీల్లో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేసింది. డిసెంబర్‌ 7న ట్యాంక్‌బండ్‌పై , 8న సచివాలయంలో .. 9న నెక్లెస్‌రోడ్‌లో విజయోత్సవ వేడుకలు జరపనున్నారు.

విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్‌ 9న సచివాలయంలో తెలంగాణతల్లి విగ్రహావిష్కరణ చేయనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని నిర్ణయించారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమాన్ని సభల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొననుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..