రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..! రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..?

|

Nov 29, 2024 | 8:40 AM

రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో.. రేవంత్‌ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి రేపుతోంది.

రైతులకు రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్..!  రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక  రైతుభరోసా ప్రకటిస్తారా..?
Cm Revanth Reddy On Farmers
Follow us on

రేపో.. మాపో గుడ్‌ న్యూస్‌..! Stay Tune To CM అంటోంది.. రేవంత్‌ సర్కార్. మరి తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు చెప్పే ఆ గుడ్‌ న్యూస్‌ ఏంటి..? రుణమాఫీ సంపూర్ణం చేస్తారా లేక రైతుభరోసా ప్రకటిస్తారా..? ఇంతకూ ప్రభుత్వంపై రైతులకున్న అంచనాలేంటి.. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ.

ఏడాది పాలన పూర్తిచేసుకుంటున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రాష్ట్రవ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో రైతులకు మరో శుభవార్త వినిపించేందుకు తెలంగాణ సర్కారు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రకటన చేశారు మంత్రి దామోదర రాజనర్సింహ. రైతులకు సంబంధించిన కీలక అంశాలను సీఎం చెబుతారని మంత్రి ప్రకటించడంతో.. రేవంత్‌ ప్రభుత్వం చెప్పే ఆ శుభవార్త ఏంటనే ఆసక్తి రేపుతోంది. రైతుభరోసా అమలుపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని కొంతమంది అంచనా వేస్తుంటే.. మరికొంతమంది మాత్రం పూర్తి రుణమాఫీపై ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నారు.

మరోవైపు రుణమాఫీ సంపూర్ణం చేస్తారన్న చర్చ కూడా నడుస్తోంది. అయితే రైతుభరోసాకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ సబ్‌కమిటీ వేశారు. నివేదిక వచ్చే వరకూ ఆగక తప్పదు. అయితే రైతు భరోసాపై అప్పుడే నిర్ణయం తీసుకునే అవకాశం లేనట్టే..! అందువల్ల రుణమాఫీ పెండింగ్‌లో ఉన్న రైతులకు రేవంత్ శుభవార్త చెప్పబోతున్నారా.. లేక ఇంకేదైనా కొత్తగా పథకం ఉండబోతోందా? అనే చర్చ నడుస్తోంది.

తెలంగాణలో మొత్తం 42 లక్షల మంది రైతులు..31 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు.. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న రైతుల అకౌంట్లలో ఇప్పటివరకూ 3 విడతల్లో డబ్బు జమ చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. దాంతో 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల మేర ప్రయోజనం కలిగింది. అయితే 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు మరో 20 లక్షల మంది వరకూ ఉన్నారు. వారికి కూడా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం 13వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీనిపైనే రేవంత్‌రెడ్డి స్పష్టత ఇస్తారని తెలుస్తోంది.

అన్ని అర్హతలు ఉన్నా కూడా రెండు లక్షల లోపు రుణాలు తీసుకున్న కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదు. రేషన్ కార్డులు లేకపోవడం, ఆధార్, బ్యాంకు ఖాతాల్లో పేర్లు, నంబర్లు తప్పుగా ఉండటం వంటి కారణాలతో వారికి మాఫీ వర్తించలేదు. ఇలాంటి వారి సంఖ్య 4 లక్షల ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన అధికారులు..వివరాలు సేకరించారు. ఆ రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసే అవకాశం ఉంది. దీనిపై కూడా ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఏడాది పాలన విజయోత్సవాల్లో భాగంగా మూడ్రోజులపాటు జరిగే రైతు పండగ ముగింపు సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. ఆ సందర్భంగా ఆయనిచ్చే తాయిలం ఏంటో తెలియాలంటే.. 30వ తేదీ దాకా వెయిట్‌ చేయాల్సిందే..ఏదేమైనా రైతులకు గుడ్‌న్యూస్‌ మాత్రం పక్కా..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..