Telangana: పాతబస్తీలో కరెంట్ బిల్ వసూలు చేయడం కష్టమేనా..? బకాయిలు వసూలు అయ్యేదెలా?

|

Jul 09, 2024 | 12:27 PM

హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

Telangana: పాతబస్తీలో కరెంట్ బిల్ వసూలు చేయడం కష్టమేనా..? బకాయిలు వసూలు అయ్యేదెలా?
Electricity Bill
Follow us on

హైదరాబాద్‌ పాతబస్తీలో కరెంట్ బిల్లుల వసూలు అధికారులకు ప్రాణ సంకటంగా మారింది. గతంలో బిల్లులు అడిగితే దాడులు జరిగిన సందర్భాలు చూశాం. ఈ క్రమంలో బిల్లుల వసూలు బాధ్యత ఆదానీ గ్రూప్‌కి ఇచ్చారనే వార్తలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఇంతకీ రేవంత్ సర్కార్‌ కాంట్రాక్ట్‌ బాధ్యతలు ఆదానీ సంస్థకు ఇచ్చేసిందా? అదే నిజమైతే ఆందోళన తప్పదని హెచ్చరిస్తోంది బీఆర్‌ఎస్‌.

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విద్యుత్ బిల్లు చెల్లించమన్నందుకు విధుల్లో ఉన్న అధికారులపై చేసిన దాడి ఇది. కాళ్లతో ఛాతిపై తన్నుతూ, అసభ్య పదజాలంతో దూషిస్తున్న వీడియో అప్పట్లో అధికారుల గుండెల్లో వణుకు పుట్టించింది. పాతబస్తీ పరిధిలో కరెంట్ బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని వసూలు చేయడమంటే అధికారులకు వణుకే. ఎవరెప్పుడు ఎలా ఎదురు తిరుగుతారో.. ఎలా దాడి చేస్తారో తెలియని పరిస్థితి. పైగా కరెంట్ కట్ చేస్తే అదో తలకాయ నొప్పి. దీంతో అటు వసూలు చేయలేక.. ఇటు పై అధికారులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్న పరిస్థితి. ప్రభుత్వం నుంచి వచ్చేది ఏదైనా ఉచితంగా రావాలన్నది కొంతమంది అభిమతంగా కనిపిస్తోంది. దాదాపు 40శాతం మందికి పైగా విద్యుత్ బిల్లులు చెల్లించరనే ఆరోపణలు ఉన్నాయి.

బిల్లుల లొల్లిపై దృష్టిసారించిన రేవంత్ ప్రభుత్వం.. ఓల్డ్ సిటీ రీజియన్ బాధ్యతను పైలట్ ప్రాజెక్టుగా గౌతమ్ అదానీ నేతృత్వంలోని గుత్తేదారుకు అప్పగించాలని సూచించింది. వినియోగదారులు బిల్లులు చెల్లించకపోవడం, బకాయిలు వసూలు చేసేందుకు వెళ్లిన విద్యుత్‌ సిబ్బందిపై దాడులు చేయడంతో ఆ నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తోంది. తాజాగా రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్‌ఎస్ భగ్గుమంది. బిల్లుల బాధ్యతల్ని ఆదానీ గ్రూప్‌కి ఇవ్వడమంటే పాతబస్తీ ప్రజల్ని అవమానించడమేనన్నారు మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ. త్వరలో ఆందోళన తప్పదని హెచ్చరించారు.

పాతబస్తీలో కరెంట్ బిల్ వసూలు చేయడమంటే మామూలు విషయం కాదు. చాలామంది సరిగా బిల్లులు కట్టరని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్‌కి అప్పగించడమే మంచిదని కొందరు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ మ్యాటర్‌ రాజకీయంగా ఏ టర్న్ తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..