ఐదు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఆదాయం రాబట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎవరినీ ఉపేక్షించకుండా పన్ను వసూలు చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తానన్న సీఎం.. వార్షిక లక్ష్యం చేరుకోవాలంటే మంత్లీ టార్గెట్ నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునరవ్యవస్థీకరించుకోవాలని, ఆదాయం రాబట్టేందుకు వీలైనన్ని సంస్కరణలు చేపట్టాలని ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రవాణా విభాగాల అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.
జీఎస్టీ ఆదాయం పెంచుకునేలా చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం సూచించారు. జీఎస్టీ రాబడి పెంచేందుకు వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. జీఎస్టీ చెల్లింపుల విషయంలో ఎవరినీ ఉపేక్షించకుండా పన్ను వసూలు చేయాలన్నారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా ఏవియేషన్ ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలప్పుడు మద్యం సెల్స్ ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవటానికి గల కారణాలపై సీఎం ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశంపైనా చర్చించారు. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన అధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీఎం ఆదేశించారు.
రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులతో పాటు అభివృద్ది కార్యక్రమాల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని సమావేశంలో చర్చ జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను, లీకేజీలను అరికట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. నెలవారీ సమీక్షతో పాటు ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారన్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మంత్లీ టార్గెట్ పెట్టుకొని రాబడి సాధించేందుకు కృషి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..