తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాయం కావాలిః సీఎం రేవంత్ రెడ్డి

|

Sep 10, 2024 | 3:32 PM

రాష్ట్రంలో పర్యటిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్‌కు వినతుల కూడిన నివేదికను అందించింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు..

తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు సాయం కావాలిః సీఎం రేవంత్ రెడ్డి
16 Finance Commission
Follow us on

రాష్ట్రంలో పర్యటిస్తున్న 16వ ఫైనాన్స్ కమిషన్‌కు వినతుల కూడిన నివేదికను అందించింది తెలంగాణ సర్కార్. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి సహాయం అందించాలని ప్రజాభవన్ లో నిర్వహిస్తున్న ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అన్న సీఎం, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తున్నామన్నారు. దేశాభివృద్ధి భాగం అయ్యేందుకు కృషీ చేస్తామన్న సీఎం, అందుకు తగిన సాయం సాయం అందించాలని ఫైనాన్స్ కమిషన్‌ను కోరారు. పన్నుల నుంచి వచ్చే ఆదాయం వాటాను 41% నుంచి 50% పెంచాలని కోరారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ రాష్ట్రానికి జీవరేఖ లాంటివి.. ఈ రాష్ట్ర ప్రజలకు ఆర్థిక భరోసాలు, అధిక భద్రతను కల్పిస్తాయని తెలిపారు.

దేశంలోనే తెలంగాణ వేగంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. అంతేకాదు మన దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ.. ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. భారీ రుణ భారం తెలంగాణకు సవాల్ గా మారిందన్న సీఎం, గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణ భారం రూ.6.85 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో బడ్జెట్ రుణాల తో పాటు ఆఫ్-బడ్జెట్ రుణాలు ఉన్నాయన్నారు. గత పదేళ్లలో ప్రభుత్వం భారీ గా అప్పులు తీసుకుంది. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిందన్నారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు మాకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరారు.

రుణాన్ని రీ స్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వండి.. లేదా మాకు అదనపు ఆర్ధిక సహాయాన్ని అందించాలని కోరారు. కేంద్ర పన్ను ల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచండి. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నామన్నారు. ఈ డిమాండ్ ను మీరు నెరవేర్చితే.. దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. తెలంగాణను ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు తగినంత సహాయం అందించండి. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను మార్చడంలో తమ వంతు బాధ్యతను నేరవేరుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

పదహారవ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, డాక్టర్ అరవింద్ పనగారియా, కమిషన్ సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, అన్నీ జార్జ్ మాథ్యూ, డాక్టర్ మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ కూడిన 16వ ఫైనాన్స్ కమిషన్ బృందంలో తెలంగాణలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి ఆర్థిక సంఘం సభ్యులతో సమావేశమయ్యారు.

కేంద్రం నుండి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు గురించి రాష్ట్ర ప్రభుత్వం చర్చించింది. జనాభా ఆధారంగా కాకుండా, అభివృద్ధి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిధులు కేటాయించాలని, అలాగే వర్షాలు, కరువు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తుల నిధులను పెంచాలనే అంశాలను ఆర్థిక సంఘం ముందు ప్రతిపాదించింది సర్కార్. అదనంగా, పన్నుల ఆదాయంలో రాష్ట్రాలకు న్యాయమైన వాటాను కోరే అంశాన్ని కూడా చర్చించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారం గ్రామాన్ని సందర్శించనుంది ఫైనాన్స్ కమిషన్. సందర్భంగా గ్రామీణ వైద్య సేవల కోసం 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై పరిశీలించనున్నారు. రేపు బుధవారం, సెప్టెంబర్ 11న ఉదయం, 16వ ఆర్థిక సంఘం తిరుగు ప్రయాణం కానుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..