CM KCR Vasalamarri Visit : ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో పర్యటించనున్నారు. గత రెండు రోజులుగా సీఎం జిల్లాల పర్యటన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ కేసీఆర్ దత్తత గ్రామమైన వాసాల మర్రిలో గ్రామస్తులందరికీ భోజనాలు కార్యక్రమంతోపాటు, బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇందుకు గాను ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తోపాటు, ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యురాలు గొంగిడి సునీత, కలెక్టర్ పమేలా సత్పతితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు నిన్న వాసాలమర్రిలో ఏర్పాట్లను పరిశీలించారు. సభాస్థలి, భోజనశాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ సభ విజయవంతానికి పూర్తిస్థాయిలో కార్యాచరణ ఉండేందుకు గాను సమీక్ష నిర్వహించారు. గ్రామసభలో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు, ఇతర గ్రామాల వారు రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. సహపంక్తి భోజనాలు ఒకచోట, సభ మరోచోట నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఇంటింటికి తిరిగి గ్రామస్థులకు అధికారులు పాసులు అందజేశారు. ఇలా ఉండగా, వాసాలమర్రి గ్రామంలోని 2,600 మంది నివాసితులతో సీఎం కేసీఆర్ కమ్యూనిటీ లంచ్‌లో పాల్గొన్న అనంతరం గ్రామంలో వివిధ అభివృద్ధి పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్ స్వయంగా వాసాలమర్రి గ్రామ సర్పంచ్ ఆంజనేయులుకు ఫోన్‌లో చేసిన సూచనల మేరకు ఏర్పాట్లు చేయడంలో మూడు రోజులుగా జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నమైంది.
కాగా, సీఎం కేసీఆర్ ఆదివారం నుంచి వరుసగా జిల్లాల పర్యటనలలో పాల్గొంటున్నారు. తొలిరోజైన ఆదివారం సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. సోమవారం వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా కాళోజీ యూనివర్సిటీ, వరంగల్ అర్బన్ కలెక్టరేట్లను ప్రారంభించారు. వరంగల్ సెంట్రల్ జైలు ప్రాంగణంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖాన భవన నిర్మాణానికి భూమి పూజచేశారు. ఇక , ఇవాళ (22 వతేదీన) తన దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామానికి సీఎం వెళ్తున్నారు.
Read also : Perni Nani : నారా లోకేష్‌కు జూనియర్ ఎన్టీఆర్ భయం పట్టుకుంది : మంత్రి పేర్ని నాని