Telangana Cabinet: ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్.. 50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ కేబినెట్ ఆమోదం

|

Jul 13, 2021 | 9:02 PM

రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కొత్త పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

Telangana Cabinet: ఇకపై ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్.. 50 వేల ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ కేబినెట్ ఆమోదం
Cm Kcr
Follow us on

Telangana Cabinet Key Decisions: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 50 వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు కొత్త పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇకపై ఉద్యోగ నియామకాలకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలన్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంగళవారం కేబినెట్‌ సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. ఏటా నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ తయారీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియపై రేపు కూడా మంత్రివర్గం చర్చించనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థ మేరకు ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు చేపట్టనున్నారు. నూతన జిల్లాల వారీగా పోస్టులు కేటాయించాలని కేబినెట్‌ ఆదేశించింది. ఉద్యోగుల కేటాయింపులపై టీఎన్‌జీవో, టీజీవో విజ్ఞప్తిపై కేబినెట్‌లో చర్చ జరిగింది.

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. లోకల్ కేటగిరీలో 50శాతం సీట్లు కేటాయించనున్నారు. కొత్త జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపు జరగాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీపై రేపు కూడా కేబినెట్‌ సమావేశం జరగాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ప్రభుత్వ గురుకులాలు, విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు కేటాయించాలని నిర్ణయించింది. ఆయా నియోజకవర్గాల విద్యార్థులకు 50శాతం సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో స్థానిక విద్యార్థులకు ఆయా విద్యాలయాల్లో మరిన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రతినెలా జరిగే సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీ, జడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లను విధిగా ఆహ్వానించాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఇక, పల్లె, పట్టణ ప్రగతి పురోగతిపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు కేబినెట్‌కు నివేదికలు సమర్పించాయి. నెలలోపు రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు పూర్తిచేయాలని మంత్రులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల కోసం ఏర్పాట్లు చేయాలని, ఇందుకు మూడోవైర్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ శివారు పురపాలికల్లో నీటి సమస్యపై కేబినెట్‌లో చర్చ జరగ్గా.. తక్షణమే అదనంగా రూ.1,200 కోట్లను ముఖ్యమంత్రి మంజూరుచేశారు.

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరో వైపు రాష్ట్రంలోని భూముల విలువ పెంపు, రిజిష్ట్రేషన్ చార్జీల పెంపుపై కేబినెట్‌లో కొనసాగుతున్న ప్రత్యేక చర్చ కొనసాగింది. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం లాండ్ పూలింగ్ వ్యవస్థలో ప్రత్యేకంగా లే అవుట్లను అభివృద్ధి చేయాలని, అందుకు సంబంధించిన అవకాశాలను, విధివిధాలాను అన్వేషించాలని మున్సిపల్‌ శాఖ అధికారులను కేబినెట్‌ ఆదేశించింది.

Read Also….  Heavy Rain: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..!