CM Kcr Review Meeting: ఇక నుంచి అవన్నీ ఒకే గొడుగు కిందకి.. జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి...
CM Kcr Review Meeting: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ, మధ్య, చిన్న తరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందకి తేవాలని నిర్ణయించారు. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు కూడా. సోమవారం నాడు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర జలవనరుల శాఖపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం మొత్తాన్ని 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఇదిలాఉంటే.. రాష్ట్రంలో అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలు చేప్టటామని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇక జిల్లాల వారీగా ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక, ఆదిలాబాద్ జిల్లాలో కుప్పి ప్రాజెక్టు, మహబూబ్ నగర్ జిల్లాలో గట్టు ప్రాజెక్టు, జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం టెండర్లను వెంటనే పిలిచి, పనులు చేపట్టాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వరంగల్ జిల్లాలో గోదావరి కరకట్టల పనులను వచ్చే వానాకాలంలోపు పూర్తి చేయాలన్నారు. అలాగే, వర్ధన్నపేట నియోజకవర్గంలోని కోనారెడ్డి చెరువుకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. పరకాల నియోజకవర్గం పరిధిలోని కోనాయమాకుల ఎత్తిపోతల పథకంలో మిగిలిపోయిన పనులను తక్షణం పూర్తి చేయాలని కోరారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం చేపట్టాలన్నారు. దీనికోసం వెంటనే సర్వే నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఇక హుజూర్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ సమీక్ష సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ విప్ లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, రేఖా నాయక్, ఆత్రం సక్కు, హన్మంత్ షిండే, ఆరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్సీలు సి.మురళీధర్, బి.నాగేంద్రరావు, హరిరామ్, సీఈ వి.రమేశ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్ పాండే, సలహాదారు కె.పెంటారెడ్డి, డిప్యూటీ ఈఎన్సీ ఎం.అనిత, డీడీఏ కె.ఆర్.చందర్ రావు, ఎస్ఈ ఎస్.భీమ్ ప్రసాద్, డీడీఎం సాజిద్, కె.ప్రసాద్ పాల్గొన్నారు.