
రైతుల గురించి తన సభల్లో పదే, పదే ప్రస్తావిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ధరణి, ఉచిత కరెంట్, రైతు బంధు చుట్టే సీఎం కేసీఆర్ ప్రసంగం ఉంటోంది. డెబ్భై లక్షల మంది రైతుల ఓట్లు టార్గెట్ ఎలక్షన్ అజెండా ఫిక్స్ చేసినట్లుంది బీఆర్‌ఎస్. అందుకే సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా రైతులకు సంబంధించిన వ్యవహారాలపైనే మాట్లాడుతున్నారు. తన ప్రచారం అంతా వారి చుట్టే తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, ధరణి తీసేస్తే… రైతుబంధు రాదని చెబుతున్నారు. కర్ణాటకలో 5 గంటలే వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్నారని.. అక్కడ రైతులు ఘోస పడుతున్నారని వివరిస్తున్నారు. ధరణి ఎత్తేస్తే ప్రజలు భూములు మళ్ళీ ఇతరుల చేతుల్లోకి వెళ్తాయని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కొన్ని అంశాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతను రైతుల ఓట్లతో బ్యాలెన్స్ చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నట్లు అర్థమవుతుంది. కొన్ని వర్గాల ఓట్లు అటు ఇటూ అయినా రైతుల ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సుమారు 97 లక్షల ఓట్లు పడ్డాయి. 46 శాతం ఓట్లతో BRS 83 సీట్లు దక్కించుకుంది. ఇప్పుడు 70 లక్షల మంది రైతులకు రైతు బంధు అందుతోంది. వారి కుటుంబ సభ్యులు అంతా కలిపి రెండు కోట్లు వరకు అవుతారు. అందులో సగం ఓట్లు బీఆర్‌ఎస్‌కు వచ్చినా గట్టేక్కినట్లే అని BRS నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. విపక్షాలు ఎంత రెచ్చగొట్టినా.. వేరే అంశాల జోలికి పెద్దగా వెళ్లకుండా రైతుల అజెండాను సీఎం కేసిఆర్ ప్రచారం చేస్తున్నారు. రైతుల చుట్టే సెంటిమెంట్ రాజుకునే ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన పాచిక పారుతుందో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..