రాష్ట్రంలో లాక్‌డౌన్ పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈ నెల 30న కేబినెట్ మీటింగ్ ఉన్న నేపథ్యలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ చేసి వారి అభిప్రాయాలతో పాటు స్థానిక పరిస్థితులు తెలుసుకున్నారు. లాక్‌డౌన్ ఎలాంటి ఫలితాలను ఇస్తుంది? వివిధ వర్గాల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఆంక్షలు, సడలింపులపై వారి వెర్షన్ ఎలా ఉంది? పోలీసుల పనితీరు ఎలా ఉంది? తదితర వివరాలను ముఖ్యమంత్రి అడిగారని తెలిసింది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా మే 12 నుంచి ప్రభుత్వం లాక్‌డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ గడువు ఈ నెల 30తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి నిర్ణయం తీసుకునేందుకు అదే రోజు కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. ఎజెండాలో లాక్‌డౌన్ కీలకం కావడంతో దాని గురించి మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి సమాచారం తీసుకున్నారు. లాక్‌డౌన్ కొనసాగించాలా? ఆంక్షలేమైనా తొలగించాలా? ఇతర నిర్ణయాలపై సూచనలు, సలహాలు తెలియజేయాలని కోరారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవాలని సీఎం సూచించారు.
రాష్ట్రంలో వానాకాలం పంటల సీజన్‌తో పాటు ప్రజలకు, సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవుతున్నందున లాక్‌డౌన్‌పై ప్రభుత్వ నిర్ణయం కీలకమని, ప్రజల మనోభావాల మేరకే ముందుకుసాగుదామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇంటెలిజెన్స్ వర్గాలను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.