Telangana CM KCR Review meeting : తెలంగాణ వరప్రదాయనిగా కాళేశ్వరం ప్రాజెక్టు మారిన నేపథ్యంలో వానా కాలం సీజన్ ప్రారంభం కాగానే నీటిని ఎత్తిపోసి పైనించి చివరి ఆయకట్టు తుంగతుర్తి దాకా ఉన్న అన్ని చెరువులను, రిజర్వాయర్లను, చెక్ డ్యాములను నింపుకోవాలని సీఎం కేసీఆర్ అధికార్లకు సూచించారు. రోహిణి కార్తె ప్రారంభమయిన నేపథ్యంలో, నారుమడి సిద్ధంచేసుకుంటే వరిపంట చీడపీడల నుంచి రక్షింపబడతుందనీ, అధిక దిగుబడి వస్తుందనే విశ్వాసంతో రైతులు వుంటారనీ, కావున వారికి నీరు అందించడానికి ఇరిగేషన్ శాఖ సంసిద్ధం కావాలని సీఎం సూచించారు. మంగళవారం ఆయన ప్రగతి భవన్‌లో నీటిపారుదల శాఖపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఇటీవల నెల్లికల్లులో శంకుస్థాపనతో మంజూరు చేసిన 15 లిఫ్టు ప్రాజెక్టులన్నింటికి, కాల్వల నిర్మాణం, పంపుల ఏర్పాటు తదితరాలన్నీ కలిపి అంచనాలను తయారు చేయాలని సీఎం సూచించారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా బంగారు తునకగా మారుతుందనీ, దేవాదుల ప్రాజెక్టును నూటికి నూరుశాతం వరంగల్ జిల్లాకే అంకితం చేస్తామన్నారు. ఇదే విధంగా మిగతా జిల్లాల్లోనూ కృష్ణా, గోదావరి బేసిన్లలో సాగునీటినందించే సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వ్యూహాన్ని ఖరారు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.