ఇవాళ మొదలైన తెలంగాణ వర్షాకాల సమావేశాల్లో సభ నడక ఎలా ఉండాలన్నదానిపై నిర్వహించిన బీఏసీ సమావేశంలో ఆసక్తికర చర్చ జరిగింది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య పదునైన మాటల తూటాలు పేలాయి. అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్ ఎత్తివేయడాన్ని భట్టి విక్రమార్క తప్పుబట్టారు. సభలో మైక్ ఎలాగూ ఇవ్వరు.. కనీసం మీడియా పాయింట్ అయినా ఉండాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యానే మీడియా పాయింట్‌ను ఎత్తేయాల్సి వచ్చిందన్నారు. సభ కంటే మీకు మీడియా పాయింట్ ఎక్కువైందా? అని భట్టిని సీఎం ప్రశ్నించారు. సభ్యుల సంఖ్య ప్రకారం సభలో సమయం ఇస్తామని.. దాని ప్రకారం సభ్యులు నడుచుకుని తమ సమస్యలను వినిపించాలని సీఎం సూచించారు. మరోవైపు, రెవెన్యూ చట్టంపై స్టడీకి 4 రోజులు గడువు ఇవ్వాలని భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు అంత సమయం ఎందుకని సీఎం కేసీఆర్ ఆయనను ప్రశ్నించారు. బిల్లు తయారు చేయడానికి మీకు మూడేళ్లు పట్టిందన్న భట్టి విక్రమార్క.. తమకు ఆ బిల్లును స్టడీ చేయడానికి 4 రోజులు సమయం ఇస్తే ఏమవుతుందని వ్యాఖ్యానించారు. భట్టి వ్యాఖ్యలతో విభేదించిన కేసీఆర్.. కాంగ్రెస్ నాయకులు అబద్దాలు మాట్లాడుతూ.. ప్రజలను గందరగోళ పరుస్తున్నారని, ఆ విషయాలను సభలో ప్రస్తావిస్తామన్నారు.