CM KCR Huzurabad Highlights: దళితబంధు వచ్చినా రేషన్‌, పెన్షన్లు కొనసాగుతాయి. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.

|

Aug 16, 2021 | 9:00 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకాన్ని ప్రారంభించారు..

CM KCR Huzurabad Highlights: దళితబంధు వచ్చినా రేషన్‌, పెన్షన్లు కొనసాగుతాయి. స్పష్టం చేసిన సీఎం కేసీఆర్.
Kcr

Telangana Dalit Bandhu Scheme: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళితబంధు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే హుజురాబాద్ నియోజకవర్గం నుంచి దళిత బంధు పథకం ప్రారంభించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకాన్ని ఎలా అమలు చేయనున్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి వ్యాపారాలు చేయాలి లాంటి వివరాలను సీఎం తెలిపారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు సీఎం స్వయంగా అందించారు.

శాలపల్లి ఇంద్రానగర్‌లో మొత్తం 20 ఎకరాల్లో లక్షా 20వేల మందితో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. దళితుల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చేందుకే ఈ పథాకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కోసం రూ. 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం. రానున్న 15 రోజుల్లో మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. తెలంగాణలో ప్రారంభించిన దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేసీఆర్ అన్నారు. దళితబంధు వచ్చినా రేషన్‌, పెన్షన్లు కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 16 Aug 2021 03:53 PM (IST)

    మొదలైన చెక్కుల పంపిణీ..

    హుజురాబాద్‌లోని శాలపల్లిలో దళిత బంధు కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అర్హులైన 15 మందికి స్వయంగా చెక్కులు అందిస్తున్నారు.

  • 16 Aug 2021 03:50 PM (IST)

    కేసీఆర్‌ కాకపోతే మరొకరు సీఎం అవుతారు.. కానీ..

    ‘నేడు నా తెలంగాణ మూడు కోట్ల నలభై టన్నుల ధాన్యాన్ని పండిస్తోంది. ఈ విషయాన్ని నేను కాలర్‌ ఎగరేసి చెబుతున్నా. పండిన పంటను మోయలేక హమాలీలు అవస్థ పడుతున్నారు, గోధాములు సరిపోవడం లేదు. తెలంగాణ ఇంకా ముందకు పోవాలి. కరువు కాటకాలు లేని తెలంగాణ సాధ్యంకావాలి. సస్యశామల తెలంగాణ కావాలి. అలాగే అణిచివేతకు గురైన తెలంగాణ రాష్ట్రంలోని 75 లక్షల మంది దళిత ప్రజానీకం ధనిక ప్రజానీకం కూడా మాది తెలంగాణ.. మేము పైకి వచ్చామని చెప్పాల్సిన పరిస్థితి రావాలి. ఎన్నికలు వస్తాయి పోతాయి.. కేసీఆర్‌ కాకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి అవుతారు. కానీ నేను తెచ్చిన పథకాలు ఎవరూ ఆపలేరు. చావు అంచుతాక పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని కలకలలాడే రాష్ట్రంగా చూడాలని ఆకాంక్షల మాలో ఉంటుంది’ అని సీఎం చెప్పుకొచ్చారు.


  • 16 Aug 2021 03:41 PM (IST)

    దళిత వాడలన్నీ బంగారు మేడలు అవుతాయి..

    అందరు పట్టుపట్టి పని చేస్తే దళిత వాడలన్నీ బంగారు మేడలవుతాన్నయారు సీఎం. ఇందు కోసం మనకు ఓపిక, నైపుణ్యం అవసరం. ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చే గొప్పే సంస్కారం అవసరం అని సీఎం అన్నారు. ‘హుజురాబాద్‌లో నిన్న మొన్న కొందరు గొడవలు చేశారని తెలిసింది. ఇలా చేసే వారు దళిత బంధు ఇస్తారా? మరో 20 రోజుల తర్వాత మళ్లీ హుజూరాబాద్‌ వస్తాను.. అప్పుడు ఇంతలా సంబురం అవసరంలేదు. నేనే కొన్ని మండలాలు తిరిగి ఎలా ముందుకు వెళ్లాలో చర్చిస్తా. మీ జిల్లా కలెక్టర్‌ మంచి అధికారి. దళిత బంధు పతకాన్ని గొప్పగా ముందుకు తీసుకెళ్లాలంటే ఓపిక ఉన్న వ్యక్తి కావాలని రాహుల్‌ బొజ్జాను ఇక్కడ కలెక్టర్‌గా నేనే నియమించాను. రేపటి నుంచి రాహుల్‌ నా కార్యక్రమంలో సెక్రటరీగా ఉంటార’ని సీఎం తెలిపారు.

  • 16 Aug 2021 03:29 PM (IST)

    కేసీఆర్‌కు ఆ దమ్ములేదా.. 15 రోజుల్లో రూ. రెండు వేల కోట్లు ఇస్తాం.

    ‘రూ. 500 కోట్లు మాత్రమే విడుదల చేశారు.. మిగితావి ఇస్తారా అన్ని కొందరు ప్రశ్నించారు. మిగతా డబ్బులు ఇచ్చే దమ్ము కేసీఆర్‌కు లేదా.? రానున్న 15 రోజుల్లో ఇంకో రూ. రెండు వేల కోట్లు ఇస్తాం. డబ్బులు మీ కలెక్టర్‌ దగ్గర ఉంటాయి, దళితులకు ఇవ్వండి. అయితే ఈ డబ్బులతో అందరూ ఒకే పని చేయకూడదు. ఈ పథకానికి బ్యాంకులతో పని లేదు. మళ్లీ డబ్బులు రిట్నర్‌ ఇవ్వమని ఎవరూ అడగరు. డబ్బును ఎలా వాడాలన్న దానిపై ఎలాంటి నిబంధనలు ఉండవు. మీకు నచ్చిన పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు. మీకు అనుభవం ఉన్న పనులను మీరే సొంతంగా ప్రారంభించుకోవచ్చు. ఎలాంటి వ్యాపారం చేయాలని మీకు ఆలోచన లేకపోతే మీ కలెక్టర్‌ సలహా ఇస్తారు. రూ. పదిలక్షలను ఏడాది కాలంలో రూ. 20 లక్షలు చేయడమే దళిత బంధు ఉద్దేశం’ అని కేసీఆర్‌ తెలిపారు.

  • 16 Aug 2021 03:22 PM (IST)

    దళిత బంధు ఆలోచన ఈరోజే పుట్టింది కాదు..

    తనకు దళిత బంధు ఆలోచన ఈరోజే పుట్టింది కాదని 25 ఏళ్ల క్రితం నుంచే తన ఆలోచనల్లో ఉందని కేసీఆర్‌ తెలిపారు. ఈ క్రమంలోనే తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే దళిత జ్యోతి పేరుతో పాటలు విడుదల చేశామని గుర్తుచేశారు. తెలంగాణ నేడు చేస్తోన్న ఈ పనిని దేశ ప్రధానులు చేసుంటే దళితులకు ఈ పరిస్థితి వచ్చేదా అని సీఎం అన్నారు. రెండు నెలల్లో హుజురాబాద్‌లోని ప్రతీ దళిత కుటుంబానికి రూ. పది లక్షలు అందిస్తామని తెలిపారు. హుజూరాబాద్‌ దళిత బంధు పథక అమలుకు ఒక ప్రయోగశాల అని సీఎం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేస్తున్న దళితులకు కూడా దళిత బంధు పథకం వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు ఈ వరుసలో చివరిలో ఉండాలని, ఆకలితో ఉన్న వారిని మొదటి వరుసలో ఉంచాలని సీఎం తెలిపారు.

  • 16 Aug 2021 03:12 PM (IST)

    దళిత బంధు ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సింది..

    దళిత బంధు పతకం నిజానికి ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సిందని చెప్పిన సీఎం. కరోనా కారణంగా ఏడాది ఆలస్యమైందని పడిందని తెలిపారు. తాను దళిత బంధు గురించి ప్రకటించగానే ప్రతిపక్షాలు రకరకలా వ్యాఖ్యలు చేశారన్నారు. దళిత బంధు ఎవరికి ఇస్తామనే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెబుతామని సీఎం పేర్కొన్నారు. ఈ పతకంపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని దళిత మేధావులు, ఉద్యోగులు తరిమికొట్టాలని సీఎం పిలుపిచ్చారు.

  • 16 Aug 2021 03:03 PM (IST)

    దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక మహా ఉద్యమం..

    దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హుజూరాబాద్‌ చేరుకున్న సీఎం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘దళిత బంధు ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇదొక మహా ఉద్యమం. ఈ ఉద్యమమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. గతంలో నేను తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు రకరకాల మాటలు విన్నాం. మీ అందరి దీవెనలతో రాష్ట్రం నలుమూలల ఉద్యం చెలరేగి 15 ఏళ్ల కృషి తర్వాత తెలంగాణను సాధించుకున్నాం. అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధించుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.

  • 16 Aug 2021 02:57 PM (IST)

    అప్పుడు అంబేద్కర్‌, ఇప్పుడు కేసీఆర్‌.. ఆసక్తికర ట్వీట్‌ చేసిన కేటీఆర్‌.

     

    తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తోన్న దళిత బంధు కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆసక్తిక ట్వీట్‌ చేశారు. ‘భార‌త‌ర‌త్న డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ 20వ శ‌తాబ్దంలో సామాజిక న్యాయం ద్వారా ద‌ళితుల‌కు విముక్తి క‌లిగిస్తే.. 21వ శ‌తాబ్దంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ద‌ళితుల ఆర్థిక సాధికారతతో వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ద‌ళితుల మేలు కోసం మరో గొప్ప కార్యక్రమం ప్రారంభిస్తోన్న ముఖ్యమంత్రికి కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

  • 16 Aug 2021 02:46 PM (IST)

    సభా స్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్‌..

    దళితుల జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబంధు కార్యక్రమం మరికాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే హుజురాబాద్‌లోని శాలపల్లి దగ్గర ఏర్పాటు చేసిన భారీ బహిరంగా సభకు సీఎం కేసీఆర్‌ కాసేపటి క్రితమే చేరుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటాలకు సీఎం నివాళులు అర్పించారు.

  • 16 Aug 2021 02:40 PM (IST)

    15 మందికి నేరుగా చెక్కులు అందించనున్న సీఎం..

    తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. హుజురాబాద్‌లోని శాలపల్లి దగ్గర ఇప్పటికే కోలాహలం నెలకొంది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ సభాస్థలికి చేరుకోనున్నారు..అక్కడే దళిత బంధు పైలెట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో సీఎం మొదట 15 మంది లబ్దిదారులకు రూ. 10 లక్షల చొప్పున చెక్కులను అందిస్తారు. ఆ తర్వాత గ్రామాల వారీగా సభలు జరిపి లబ్దిదారులను ఎంపిక చేస్తారు. ప్రతి ఒక్క దళిత కుటుంబానికి పథకాన్ని అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు అధికారులు.

  • 16 Aug 2021 02:17 PM (IST)

    ఆకట్టుకుంటోన్న స్వాగత ఏర్పాట్లు..

    దళిత బంధు ప్రారంభోత్సవానికి హుజూరాబాద్‌ వస్తోన్న సీఎం కేసీఆర్‌కు భారీ ఎత్తున స్వాగత ఏర్పాటు చేశారు. పట్టణమంతా గులాబీమయమైంది. ఆటపాటలు, డప్పు వాయిద్యాల నడుమ ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తున్నారు కళాకారులు. రకరకాల వేషాధారణతో కళాకారులు చేస్తోన్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

  • 16 Aug 2021 02:11 PM (IST)

    హుజూరాబాద్‌లో పండుగ వాతావరణం..

    హుజూరాబాద్‌లో పండుగ వాతావ‌ర‌ణం కనిపిస్తోంది. ద‌ళిత వాడ‌లు మెరిసిపోతున్నాయి.. ఆడ‌ప‌డుచులు మురిసిపోతున్నారు. ద‌ళిత బంధు ప‌థకంతో హుజూరాబాద్‌లోని ద‌ళిత కుటుంబాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటిని సుంద‌రంగా అలంక‌రించుకున్నారు. త‌మ ఇళ్ల ముందు రంగ‌వ‌ల్లులు వేసి.. ద‌ళిత బంధు అని చక్కగా రంగులు వేశారు. జై కేసీఆర్.. జై తెలంగాణ.. అనే ప‌దాలు రాసి.. గులాబీ పార్టీపై త‌మ‌కున్న అభిమానాన్ని చాటుకున్నారు.

Follow us on