
హైదరాబాద్ హకీంపేటలో సీఐఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య మిస్టరీగా మారింది. యూనిఫామ్‌లోనే చెట్టుకు ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు సీఐఎస్ఎఫ్ జవాన్ రవి. అయితే, ఉన్నతాధికారుల వేధింపులే ఇందుకు కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబసభ్యులు. నిజామాబాద్‌కు చెందిన రవి 2017 నుంచి ఒడిశా రూర్కెలాలో సీఐఎస్ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్నాడు. 2020లో అతన్ని విధుల నుంచి తొలగించారు. కానీ ఆ విషయం ఇంట్లో చెప్పకుండా హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయిందని.. జాబ్‌కు వెళ్తున్నానంటూ బయటకు వెళ్లేవాడు. అలాగే మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకే యూనిఫామ్ వేసుకొని డ్యూటీకి వెళ్లిన రవి.. చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.
కానీ ఇంట్లో సమస్యలేం లేవని.. సంతోషంగా ఉండేవాళ్లమని గుండెలు బాదుకుంటోంది అతని భార్య. తన భర్త ఆత్మహత్యకు బయటి వ్యక్తులే కారణమని అనుమానం వ్యక్తం చేసింది. అయితే రవి డ్యూటీకి వెళ్లేటప్పుడే తన బ్యాగ్‌లో చీర, కూల్‌డ్రింక్, పురుగుల మందు తీసుకెళ్లినట్టు స్పాట్‌లో ఆధారాలు దొరికాయి పోలీసులకు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. అయితే రవి ఆత్మహత్యకు కారణం తెలియాల్సి ఉంది. మరి ఉన్నతాధికారుల వేధింపులా..? బయటి వ్యక్తులు ఎవరైనా ఇందుకు కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ మొదలు పెట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..