
సంక్రాంతి పండుగ వేళ సరదాకోసం కొందరు వాడే మాంజా దారం అనేక కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెడుతుంది. మొన్నటికి మొన్న సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ ఘటన అందరిని కలిచి వేసింది. సంగారెడ్డి (మం) ఫసల్వాది గ్రామంలో చైనా మంజా మెడకు కోసుకుపోయి ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మృతుడు బీహార్‌కు చెందిన అద్వైక్‌గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మరవక ముందే తాజాగా మరో ఇద్దరు యువకుల మెడకు మంజాదారం తగిలి తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. కొండాపూర్ మండలం సైదాపూర్‌లో చైనా మాంజాతో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. సాయికుమార్ (18) అనే యువకుడు బైక్ పై పొలానికి వెళ్తుండగా మాంజా దారం మెడకు చుట్టుకుంది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ వైద్యులు అతని చికిత్స అందించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.
ఈ ఘటన జరిగిన కాసేపటికే రాయికోడ్ (మం) ధర్మాపూర్ గ్రామంలో మరో సంఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న సాయి కుమార్ అనే యువకునికి బైక్‌పై వెళ్తుండగా మాంజా దారం మెడకు చుట్టుకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని హాస్పిటల్‌కు తరలించారు. యువకుడిని పరీక్షించిన వైద్యులు అతనికి చికిత్స అందించారు.
ఇలా కేవలం రెండు మూడు రోజలు వ్యవధిలోనే మాంజ దారం వల్ల అనేక మంది గాయపడగా మరికొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా సరదాకోసం వాడే ఈ కనిపించిన మృత్యువులు ప్రజల పాలిక యమపాశాలుగా మారుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడుతున్నా.. ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ఇప్పటికైనా ప్రజలు మేల్కొని ఇలాంటి చైనా మాంజాను వినియోగించవద్దని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.