
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. వంటింట్లో కుపంటి పెట్టాలంటేనే దడుసుకునే పరిస్థితి నెలకొంది. ఉప్పు, పప్పులతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక ఇదే బాటలో చికెన్, గుడ్ల ధరలు కూడా ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ రూ.300 పలుకుతుంది. ఇక గుడ్డు ధర ఏకంగా రూ.10కి చేరింది. కేవలం వారంలోనే కిలో చికెన్ పై 50 రూపాయలు పెరిగింది. కార్తీకమాసం ముగిసినప్పటి నుండి చికెన్ ధరలు అమాంతంగా పెరుగుతున్నాయి. ఇలా క్రమంగా వారం వారం కిలో చికెన్ పై 10 నుంచి 20 రూపాయల వరకు పెరుగుదల కనిపిస్తుంది. ప్రస్తుతం కేజీ స్కిన్ చికెన్ 270 కాగా.. స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.300 పలుకుతుంది.
ఇక ఈ రోజు ఆదివారం కావడంతో మాంసం ప్రియులు అధిక ధరలు చెల్లించి చికెన్ ముక్క కొనలేక గుటకలు వేస్తున్నారు. వచ్చే నెలలో సంక్రాంతి ఉండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరోవైపు గుడ్ల ధరలు కూడా పెరగడంతో మధ్యాహ్న భోజనంలో విద్యార్ధులకు సైతం అందించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఒక్కో గుడ్డుకు కేవలం రూ. 6 మాత్రమే చెల్లిస్తోంది. కానీ మార్కెట్‌లో హోల్‌సేల్ ధర రూ. 7.50 ఉంది. రిటైల్ ధర రూ. 10 పలుకుతోంది. ఈ క్రమంలో విద్యార్దులకు వారానికి మూడు సార్లు అందించవల్సిన గుడ్లను రెండు సార్లు మాత్రమే అందిస్తున్నారు.
కాగా గత కొద్దిరోజులుగా కోడిగుడ్లు, చికెన్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం ముగియడం, వరుస పండుగలు రావడంతో చికెన్‌కి ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్లుగా పౌల్ట్రీ ఉత్పత్తి లేకపోవడంతో సరఫరా దెబ్బతిని ధరలు పెరిగినట్లు చెబుతున్నారు. మొత్తం వచ్చే పండగ నెలలోనూ చికెన్ రేట్లు కిలో రూ.350 నుంచి రూ.400 వరకు పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.