Hyderabad: బీ అలర్ట్.. మరోసారి ఎంటరైన చెడ్డీగ్యాంగ్.. నగర శివార్లే వారి టార్గెట్..!

|

Sep 19, 2022 | 7:28 AM

Hyderabad: భాగ్యనగరంలోకి మరోసారి చెడ్డీగ్యాంగ్‌ ఎంటరైంది. హైదరాబాద్‌ నగర శివార్లే టార్గెట్‌గా చెలరేగిపోతోంది. ఇంతకీ, ఆ డేంజర్‌ గ్యాంగ్‌ ఎక్కడ తిరుగుతోంది?

Hyderabad: బీ అలర్ట్.. మరోసారి ఎంటరైన చెడ్డీగ్యాంగ్.. నగర శివార్లే వారి టార్గెట్..!
Cheddi Gang
Follow us on

Hyderabad: భాగ్యనగరంలోకి మరోసారి చెడ్డీగ్యాంగ్‌ ఎంటరైంది. హైదరాబాద్‌ నగర శివార్లే టార్గెట్‌గా చెలరేగిపోతోంది. ఇంతకీ, ఆ డేంజర్‌ గ్యాంగ్‌ ఎక్కడ తిరుగుతోంది? పోలీసులు ఎలా కనిపెట్టారు? వివరాల్లోకెళితే.. తాజాగా హైదరాబాద్‌ శివార్లలో మరోసారి చెడ్డీ గ్యాంగ్‌ అలజడి రేగింది. సంగారెడ్డి అమీన్‌పూర్‌ ఏరియాలో తిరుగుతోన్న చెడ్డీ గ్యాంగ్‌ దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. దాదాపు 17రోజులుగా ఈ ప్రాంతంలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు అపార్ట్‌మెంట్స్‌లోకి చొరబడ్డ దృశ్యాలు బయటికి రావడంతో హడలిపోతున్నారు స్థానికులు. రెండు వేర్వేరు కాలనీల్లో హల్‌చల్‌ చేశారు చెడ్డీ గ్యాంగ్‌ సభ్యులు. తలకు తువాలు, ఒంటిపై కేవలం చెడ్డీ మాత్రమే ధరించిన దొంగలు.. మారణాయుధాలు చేతబట్టి అమీన్‌పూర్ ప్రాంతంలో హల్‌చల్‌ చేశారు.

ఈనెల 5న బృందావన్‌ టీచర్స్‌ కాలనీలోని విల్లా నెంబర్‌ 18లో 12 తులాల బంగారం చోరీకి గురైంది. బాధితుల కంప్లైంట్‌తో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు మైండ్‌ బ్లాకైన దృశ్యాలు కనిపించాయి. సీసీటీవీ ఫుటేజ్‌ను చెక్‌ చేస్తే.. నలుగురు దొంగలు చెడ్డీలతో తిరుగుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. అలాగే, ఈనెల 17న అదే ఏరియాలోని రెయిన్‌బో కాలనీలో చెడ్డీ గ్యాంగ్‌ సంచరిస్తున్న విజువల్స్‌ పోలీసులకు దొరికాయి. చెడ్డీలు ధరించిన నలుగురు దొంగలు.. రెయిన్‌బో కాలనీలో తిరుగుతుండగా అక్కడి సీసీటీవీలకు చిక్కాయి. దాంతో, అలర్టైన పోలీసులు, స్థానికులను అప్రమత్తం చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరించారు. చాన్నాళ్లక్రితం హైదరాబాద్‌ను దడదడలాడించిన చెడ్డీ గ్యాంగ్స్‌, ఇప్పుడు మళ్లీ కనిపించడంతో హైదరాబాదీల్లో భయాందోళనలు మొదలయ్యాయి. చెడ్డీ గ్యాంగ్‌ సంచారంతో పెట్రోలింగ్‌ను పెంచారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..