కరోనా వ్యాప్తి కట్టడి చేయడంలో భాగంగా తెలంగాణలో పదిరోజుల పాటు కఠిన లాక్ డౌన్ విధిస్తూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రజల అవసరాల కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ( అంటే నాలుగు గంటల పాటు) అన్ని కార్యకలాపాలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో బ్యాంకు పనివేళల్లో కూడా మార్పులు జరిగాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ మాత్రమే బ్యాంకులు వర్క్ చేయనున్నాయి. ఈ నెల 20 వరకూ ఇవే టైమింగ్స్ ఉంటాయి. కాగా కరోనా నేపథ్యంలో 50 శాతం సిబ్బందితోనే బ్యాంకులు పనిచేయనున్నాయి.
మరోవైపు ఏపీలో కూడా బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. మే 11 నుంచి 18 వరకు రాష్ట్రంలోని బ్యాంకింగ్ వేళలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ పరిమితం చేసింది. బ్యాంకుల ఆఫీసులు మధ్యాహ్నం 2 గంటల వరకు వర్క్ చేసినా.. లావాదేవీలకు మాత్రం 12 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది. కరోనా కట్టడిలో భాగంగా అకౌంట్ ఉన్నవాళ్లు సాధ్యమైనంత వరకు బ్యాంకులకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ సౌలభ్యాలను వినియోగించుకోవాలని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. ఎమర్జెన్సీ అయితేనే బ్యాంకులకు రావాలని సూచించారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్, మొబైల్, ఏటీఎం, యూపీఐ, బ్యాంక్ మిత్ర వంటి సేవలను వినియోగించుకోవాలన్నారు.