
తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం చాంద్రాయణగుట్ట (Chandrayangutta Assembly Election). ఇది హైదరాబాద్ జిల్లాలోని 15 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. దశాబ్ధాలుగా మజ్లీస్ పార్టీ(ఎంఐఎం)కు కంచుకోటగా ఉంటోంది. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ 1999 నుంచి వరుసగా ఐదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో 3,37,815 మంది ఓటర్లు ఉన్నారు. మొన్నటి పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 45.26 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మళ్లీ అక్కడి నుంచే పోటీచేసి గెలుపొందారు. ఆరోసారి కూడా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి ఎం సీతారాం రెడ్డి, కాంగ్రెస్ నుంచి బోయ నగేష్, బీజేపీ నుంచి కౌడి మహేందర్ బరిలో నిలిచి ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా అక్కడి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం నల్లేరుపై నడకేనన్న అభిప్రాయం మరోసారి వ్యక్తమైంది.
గతంలో అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తండ్రి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహించారు. 1952 ఎన్నికలు మినహా మిగిలిన అన్నిసార్లు చాంద్రాయణగుట్ట నియోజవర్గం నుంచి ముస్లీం అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. గతంలో ఎంఐఎం, ఎంబీటీల నుంచి ఇక్కడ గట్టి పోటీ ఉండేది కానీ.. క్రమంగా ఎంబీటీ ప్రాభవాన్ని కోల్పోయింది.
1978 నుంచి 1994 వరకు ఎంబీటీ నేత మొహమ్మద్ అమానుల్లాఖాన్ చాంద్రాయణగుట్ట నియోజకవర్గం నుంచి ఐదుసార్లు విజయం సాధించారు. ఆయన మూడుసార్లు ఇండిపెండెంట్, ఒకసారి ఎంఐఎం అభ్యర్థి, ఇంకోసారి సొంతంగా ఏర్పాటుచేసుకున్న ఎంబీటీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 1999లో అమానుల్లాఖాన్‌ను ఓడించి అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం) ఇక్కడి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి అక్బరుద్దీన్ ఆ నియోజవకర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యంవహిస్తున్నారు.
2018 శాసనసభ ఎన్నికల ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి 80,263 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అక్బరుద్దీన్ ఒవైసీకి 95,311 ఓట్లు దక్కగా.. బీజేపీ అభ్యర్థి సయ్యద్ పాహీబాజీకి కేవలం 15,075 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సీతారామిరెడ్డికి 14వేల మెజార్టీ దక్కింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అక్బరుద్దీన్ ఒవైసీ ఇక్కడి నుంచి 59,279 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. 2004, 2009, 2014 ఎన్నికల్లో ఎంబీటీ అభ్యర్థి ఖయ్యంఖాన్ ఇక్కడ రెండోస్థానానికి పరిమితయ్యారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్