Chain snatcher attacked : హైదరాబాద్ నగర శివారులో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు కనిపిస్తే చాలు.. మాటువేసి మెడలోని ఆభరణాలు లాక్కుని పరారవుతున్నారు కేటుగాళ్లు. ఈ క్రమంలోనే చైన్‌స్నాచర్లను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు సిబ్బందిపై దాడి చేసేందుకు సైతం వెనుకాడటం లేదు. తాజాగా హైదరాబాద్ శివారు సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లాలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. రామచంద్రాపురం పోలీసు స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్ దారుణానికి పాల్పడ్డాడు. అశోక్‌నగర్ హెచ్ఐజీ గేటు వద్ద ఓ మహిళ మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగించేందుకు చైన్ స్నాచర్ యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌వోటీ హెడ్ కానిస్టేబుల్ యాదయ్య.. స్నాచర్‌ను గమనించాడు. అప్రమత్తమైన యాదయ్య.. చైన్ స్నాచర్‌ను పట్టుకునేందుకు యత్నించాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్‌పై స్నాచర్ కత్తితో దాడి చేసి పారిపోయాడు. యాదయ్యకు తీవ్ర రక్తస్రావం కావడంతో సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు హాస్పిటల్‌కు తరలించారు. యాదయ్యను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి యాదయ్యను తరలించాలని సీపీ ఆదేశించారు.