
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్రం ఒకేసారి భారీగా నిధులు విడుదల చేసింది. గత ఏడాది చివరిలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు పూర్తి అయిన తర్వాత ఇప్పుడు నిధులు విడుదల చేసింది. దేశంలోని గ్రామ పంచాయతీల అభివృద్దికి కేంద్రం ఆర్ధిక సంఘం నిధులు అందిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తై సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టడం, పంచాయతీల్లో పాలన ఊపందుకోవడంతో కేంద్రం ఇప్పుడు నిధులు విడుదల చేసింది. దీంతో పంచాయతీల్లో ప్రజలకు రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి.
తెలంగాణలోని పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్ధిక సంఘం నిధులను జనవరి 5వ తేదీన విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లను రిలీజ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తై పాలన మొదలుకావడంతో వీటిని విడుదల చేసింది. ఇంకా దాదాపు రూ.3 వేల కోట్లకుపైగా నిధులు కేంద్రం నుంచి రాష్ట్రంలోని పంచాయతీలకు అందాల్సి ఉంది. వీటిని విడుతల వారీగా కేంద్రం విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే గ్రామ పంచాయతీల్లో పాలకుల పదవీకాలం ముగిసినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం గతంలో నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఎన్నికలు ముగియడంతో సాంకేతికంగా అడ్డుంకులు తొలగిపోవడంతో గురువారం విడుదల చేసింది.
ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు షురూ కానున్నాయి. వీధి దీపాలు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధం, ఇతర పనులకు ఆ నిధులను ఉపయోగించనున్నారు. అయితే ఈ నిధులు రావడంతో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపించారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. కేంద్ర ఉన్నతాధికారులు, ఆర్ధికశాఖ అధికారులతో పలుమార్లు మాట్లాడారు. దీంతో కేంద్రం 15వ ఆర్ధిక సంఘం నిధులు మంజూరు చేసింది.