AP- Telangana: విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే.. తేల్చిచెప్పిన కేంద్రం..

|

Feb 02, 2022 | 12:14 PM

విద్యుత్ బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వం (Central Government) కేవలం సమన్వయం మాత్రమే చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. 

AP- Telangana: విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదే.. తేల్చిచెప్పిన కేంద్రం..
Srisailam Project
Follow us on

విద్యుత్ బిల్లుల చెల్లింపులపై నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వం (Central Government) కేవలం సమన్వయం మాత్రమే చేస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రానికి తెలంగాణ  (Telangana) చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని, దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని గురువారం రాజ్యసభలో  బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనికి కేంద్ర హోం శాఖ  సహాయ మంత్రి  నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు. ‘ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల  చర్యలు తీసుకుంటుంది. హోంశాఖ నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. విద్యుత్తు బిల్లుల చెల్లింపులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం మేం (హోంశాఖ) సమన్వయం మాత్రమే చేయగలం. నిర్ణయాధికారం మాత్రం రాష్ట్రాలదే’ అని కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

శ్రీశైలం నీటి మళ్లింపులపై చర్చిస్తాం!

అదేవిధంగా  ‘తెలంగాణ రాష్ట్రం  శ్రీశైలం నీటిపారుదల ప్రాజెక్టు నుంచి నీటిని అక్రమంగా విద్యుత్తు ఉత్పత్తి కోసం విచ్చలవిడిగా వినియోగిస్తోంది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు.  దీనిపై కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది’ అని టీజీ వెంకటేష్ కేంద్రాన్ని అడగ్గా..  ‘ మేం సమన్వయం మాత్రమే చేయగలం. రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారం కోసం మేం ఇప్పటి వరకు 26 సమావేశాలు నిర్వహించాం. తదుపరి జరిగే సమావేశంలో ఈ అంశం గురించి మరోసారి చర్చిస్తాం’ అని నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.