
ఉమ్మడి ఆదిలాబాద్ లో ఆలయాలల్లో చోరీ ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అన్న తేడాలేకుండా అన్ని ఆలయాలను టార్గెట్ చేస్తున్నారు దొంగలు. కట్టుదిట్టమైన భద్రత ఉన్న దేవాలయాలు మొదలు అసలు ఎలాంటి భద్రత లేని ఆలయాల వరకు దేనిని వదలకుండా దొరికినంత దోచుకెళుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఆలయాల్లో చోరీ కేసులను ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ ఆదారంగా దొంగలను శరవేగంగా పట్టుకుంటున్నారు. బాసర ఆలయంలో చోరీ నుండి ఆదిలాబాద్ , మంచిర్యాల ఆలయాల చోరీల వరకు అన్ని చోట్ల దొంగలను పట్టించింది సీసీ కెమెరాలే.
ఆదిలాబాద్ జిల్లా శాంతినగర్ లోని హనుమాన్ ఆలయంలో చోరీకి యత్నించాడు ఓ దొంగ.. సాధ్యం కాకపోవడంతో సమీపంలో ఉన్న ఆలయాలను టార్గెట్ చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాక్ అయ్యారు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదివిన ఓ యువకుడు జల్సాలకు అలవాటు పడి ఈజీ మని కోసం ఇలా ఆలయాలను టార్గెట్ చేశాడని తేల్చారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ లో నివాసం ఉంటున్న కొలాయం కాశీనాథ్ అనే డిగ్రీ చదివిన విద్యార్థి జల్సాల కు అలవాటు పడి ఈజీ మనీ కోసం కేవలం ఆలయాలను మాత్రమే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడు. శాంతిన గర్ లోని హనుమాన్ ఆలయంలో చోరికి యత్నించి విఫలం అయ్యాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మరో పది ఆలయాల్లో విగ్రహాల నగలు, నగదు అపహరించాడు. ఇతడిపై 2టౌన్, భీంపూర్, తలమడుగు, మావల పీఎస్ లో రెండేసి చొప్పున, వన్ టౌన్ పీఎస్ లో మూడు చోరీ కేసులు నమోద య్యాయి. ఆలయాల్లో దొంగిలించిన నగలను విక్రయించటానికి వెళ్తుండగా వాహనాల తనిఖీ సందర్భంగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. నిందితుని వద్ద నుంచి 30 తులాల వెండి, 2,50 తులాల బంగారు ఆభరణాలు, ద్విచక్రవాహనం, మూడు సెల్ ఫోన్లు, రూ.2,150 నగదు, ఇత్తడి వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. చోరీ చేసిన నగలను ఆదిలాబాద్ పట్టణంలోని అశోక్ రోడ్డులో బంగారం వ్యాపారి లోకాజీ విశ్వనాథ్ కు విక్రయించేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడితో పాటు చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారిని సైతం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
అటు మంచిర్యాల జిల్లాతో పాటు పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన నిందితుడిని మంచిర్యాల పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 5న రాత్రి స్థానిక విశ్వనాథాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి బీరువాలోని విలువైన వస్తువులు దొంగిలించినట్లు పోలీ సులకు ఆలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీ సులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం దుబ్బగూడెంకు చెందిన రౌతు పవన్ ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. నేరస్థుడు గతంలో మంచిర్యాలతో పాటు కరీంనగర్, హనుమకొండ, హుస్నాబాద్ ప్రాంతాల్లో పలు ఆలయాల్లో చోరీ లకు పాల్పడినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. ఈ మేరకు నిందితుడి నుంచి 900 గ్రాముల వెండి నగలు, రూ.65 వేల నగదు స్వాధీన పరుచుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లోను సీసీ కెమెరాల సహకారంతోనే కేసులను ఛేదించారు పోలీసులు.