Cable Bridge construction Karimnagar: ఉత్తర, దక్షిణ భారతాలకు అనుసంధానంగా భావిస్తున్న కేబుల్ బ్రిడ్జి వాహనాల ప్రయాణానికి సిద్దమవుతోంది. కరీంనగర్ నగరానికి సమీపంలో మానేరు నదిపై నిర్మితమవుతున్న కేబుల్ బ్రిడ్జి తుది దశ ప్రయోగాన్ని పూర్తి చేసుకుంది. తీగల వంతెన సామర్థ్యాన్ని పరిశీలన కార్యక్రమం మొదలైంది. దీనికి అప్రోచ్ రోడ్లకు భూసేకరణ జరగాల్సి వుంది. అధునాతన సాంకేతిక పరిఙ్ఞానంతో నిర్మించిన కేబుల్ బ్రిడ్జి సామర్థ్యాన్ని పరిశీలించే పనులు జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. లోడ్ టెస్టింగ్ పనులు ప్రారంభమయ్యాయి. అయిదు రోజుల పాటు లోడ్ టెస్ట్ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. తీగల వంతెనపై 28 టిప్పర్లలో 840 టన్నుల ఇసుక, ఫుట్ పాత్‌పై మరో 110 టన్నుల ఇసుక వుంచి బ్రిడ్జి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్నారు.
ముంబై, హౌరా బ్రిడ్జిల తర్వాత ఆ స్థాయిలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి కంటే చాలా పెద్ద సైజులో కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణమవుతోంది. కరీంనగర్ సిగలో ఆకర్షణీయంగా నిలిచేందుకు సిద్దమైన తీగల వంతెన త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం యత్నాలు చేస్తోంది. అధికారులు చురుకుగా పనులను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం వంతెనపై లోడ్ టెస్ట్ కొనసాగుతుండగా… మరోవైపు అప్రోచ్ రోడ్ల నిర్మాణం పనులు కూడా వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లోడ్ టెస్ట్ పూర్తై… అప్రోచ్ రోడ్లు పూర్తైతే… త్వరలోనే కేబుల్ బ్రిడ్జిపై ప్రయాణాలను అనుమతించనున్నారు. మొదట్నించి తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన కరీంనగర్ అంటే సిఎం కెసిఆర్ కు వల్లమాలిన అభిమానం. సిఎం హోదాలో తొలిసారి కరీంనగర్ వచ్చిన కెసిఆర్… కరీంనగర్‌ను పర్యాటకంగా అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. ఇందుకోసం కేబుల్ బ్రిడ్జి… మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మించాలని తలపెట్టారు. అయితే సిఎం కెసిఆర్ ఆశయాలు… ఆకాంక్షలకు అనుగుణంగా ప్రణాళికలు రచించి, అమలు పరిచింది అధికార యంత్రాంగం.
అటు హైదరాబాద్… ఇటు వరంగల్ వెళ్ళాల్సిన వాహనాలన్నీ కూడా అలుగునూర్ బ్రిడ్జిపై నుండి వెళ్ళాల్సి వస్తుండడంతో… తరచు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో… ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే… వరంగల్ కు ప్రత్యేక రోడ్డును నిర్మించడమే మంచిదని పాలకులు భావించారు. ఈ కొత్తగా నిర్మించే రోడ్డు వరంగల్‌తో పాటు దక్షిణ భారతాన్ని కలిపే విధంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆకాంక్షలకు అనుగుణంగా… కరీంనగర్- సదాశివపల్లి మధ్య ఉన్న పాత వరంగల్ మార్గంపై 149 కోట్ల రూపాయల వ్యయంతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండి వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం తుదిమెరుగులు దిద్దుకుంటుంది. పర్యాటకులకు తియ్యని అనుభూతిని పంచి… మనస్సులను దోచుకునేందుకు సిద్దమవుతుంది. ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లాకు తలమానికంగా నిలిచి పర్యాటక శోభను పంచనుంది.
ఇలాంటి కేబుల్ బ్రిడ్జిలు కోల్‌కతాలోని హౌరా… ముంబైలోని బాంద్రాలో రెండు ఉండగా దక్షిణ భారతంలోనే తొలిసారి దేశంలో 3వ కేబుల్ బ్రిడ్జి కరీంనగర్ సమీపంలో మానేరు నదిపై నిర్మాణమవుతోంది. అత్యంత ఆధునికంగా సుందరంగా నిర్మాణమవుతున్న ఈ కేబుల్ బ్రిడ్జి… ప్రస్తుతం కరీంనగర్- వరంగల్ మధ్య ఉన్న72 కిలోమీటర్ల దూరంలో 7 కిలోమీటర్లను తగ్గించనుంది. వెయ్యి టన్నుల కెపాసిటీ ఉన్న ఈ కేబుల్ బ్రిడ్జిపై ఎంతటి బరువైన వాహనాలైన వెళ్ళేలా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారు. అంతే కాకుండా ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను డిస్ ప్లే చేసేందుకు డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తికాగా… వంతెనపై వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు… ఫుట్ పాత్ పై ప్రజలు వెళ్ళడం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని… జూన్ 24 నుండి బ్రిడ్జిపై లోడ్ టెస్ట్‌ను ప్రారంభించారు. ఈ లోడ్ టెస్ట్ జూన్ 29న ముగిసింది. ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటవెంటనే పరిష్కరించడంతో పాటు లోడ్ టెస్టు అనంతరం వంతెనపైకి వాహనాలను అనుమతించనున్నారు. వంతెనపై ఇరువైపుల 28 టిప్పర్లను నిలిపి… ఒక్కో టిప్పరులో 30 టన్నుల బరువు ఇసుక ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 840 టన్నుల ఇసుక బరువుతో పాటు… వంతెన ఇరువైపులా ఫుట్ పాత్‌లపై 110 టన్నుల ఇసుక సంచులను వేశారు. వంతెనపై మొత్తం 950 టన్నుల బరువును ఉంచి… వంతెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను ఉంచి… 24 గంటల పాటు పరీక్షించనున్నారు. ఇలా జులై 3వ తేదీ వరకు పరిశీలన చేసి… జులై 4న సెలవు ఇవ్వనున్నారు. మళ్ళీ జులై 5, 6 తేదీల్లో మరో 20 వాహనాల్లో ఇసుకను నింపి… ఫుట్ పాత్‌లపై ఇసుక బస్తాలు పెట్టి… మళ్ళీ వంతెన సామర్ధ్యాన్ని అంచనా వేయనున్నారు. పరిశీలన మొత్తం పూర్తయ్యాక ఏమైనా సమస్యలు దృష్టికి వస్తే తీసుకోవల్సిన చర్యలు చేపట్టనున్నారు.
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్ల నిర్మాణ పనులతో పాటు… కనెక్టివిటీ రోడ్ల పనులు పూర్తి కావల్సి ఉంది. ఇందుకోసం 34 కోట్ల రూపాయలతో విశాలమైన రోడ్లను నిర్మించనున్నారు. కరీంనగర్ కమాన్ నుండి సదాశివపల్లి వరకు తీగెల వంతెన నిర్మాణం పోను మిగతా 4.7 కిలోమీటర్ల మేర పనులు జరగాల్సి ఉంది. కమాన్ నుంచి బైపాస్ రోడ్డు వరకు… అలాగే సదాశివపల్లి నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు రోడ్డు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ రోడ్ల పనులు పూర్తైతే వెంటనే తీగల వంతెన పైకి వాహనాలు వెళ్ళేందుకు అనుమతించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వాంగ సుందరంగా ముస్తాబైన కేబుల్ బ్రిడ్జికి ఆధునాతనమైన లైటింగ్ మరింత శోభను తీసుకురానున్నారు. 8 కోట్ల రూపాయలతో రాత్రి వేళల్లో పర్యాటకులను అలరించే విధంగా… తీగల వంతెనపై రంగు రంగుల డిజిటల్ లైటింగ్ ఇతర ఆకర్షణీయ పనులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలు ఆమోదం పొందిన వెంటనే ఆ పనులను కూడా త్వరితగతిన చేపట్టి పూర్తి చేయనున్నారు. ఇప్పటికే మానేర్ రివర్ ఫ్రంట్ కోసం ప్రభుత్వం 410 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో ఎమ్మారెఫ్ నిర్మాణం పనులు వేగవంతం కానున్నాయి. సర్వే పనులను ఇదివరకే పూర్తి చేయగా… జులై నెలాఖరులోగా డిపిఆర్ పూర్తై ఆగస్టులో నిర్మాణం పనులు పూర్తి కానున్నాయి.
ALSO READ: ఉత్తరాదిపై మళ్ళీ నజర్.. యుపీలో వందసీట్లకు పోటీ అంటున్న సీనియర్ ఓవైసీ