Budget 2023: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే.. పెదవి విరుస్తున్న రెండు రాష్ట్రాల నేతలు..!

|

Feb 02, 2023 | 8:00 AM

తెలుగు రాష్ట్రాలపై కేంద్రానికి ఎంత మమకారం ఉందో బడ్జెట్‌ ద్వారా తెలిసిపోయింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు, వేతన జీవులకు ఊరట కలిగింటే బడ్జెట్‌ అని కేంద్రం ఊదరగొడుతున్నా..

Budget 2023: బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే.. పెదవి విరుస్తున్న రెండు రాష్ట్రాల నేతలు..!
Union Budget 2023
Follow us on

తెలుగు రాష్ట్రాలపై కేంద్రానికి ఎంత మమకారం ఉందో బడ్జెట్‌ ద్వారా తెలిసిపోయింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు, వేతన జీవులకు ఊరట కలిగింటే బడ్జెట్‌ అని కేంద్రం ఊదరగొడుతున్నా.. తెలంగాణకు పూర్తిగా అన్యాయం జరిగిందని బీఆరెస్‌ మంత్రులు చెబుతున్నారు. ఇక ఏపీ మంత్రుల స్పందన కూడా మిశ్రమంగా ఉంది..ఇంతకీ ఈ బడ్జెట్‌తో తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేంటి.. పోయిందేంటి..

తెలుగు రాష్ట్రాలకు అన్యాయమేనా..?

నిర్మలమ్మ బడ్జెట్‌ ఆమెకు ఎంత నిమ్మలంగా ఉందోగానీ..అందులో తెలుగు రాష్ట్రాలకు మాత్రం అన్యాయం జరిగిందని ఇరు రాష్ట్రాల నేతలు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాలకు కేటాయింపులు..

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు సంస్థలకు భారీగా కేటాయింపులు జరిగాయి. ఏపీ సెంట్రల్‌ యూనివర్సిటీకి రూ. 47 కోట్లు. పెట్రోలియం యూనివర్సిటీకి రూ. 168 కోట్లు, రెండు రాష్ట్రాల్లోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ. 37 కోట్లు కేటాయించారు. ఇక సింగరేణికి రూ. 1,650 కోట్ల నిధులు రానున్నాయి. ఐఐటి హైదరాబాద్‌కు EAP కింద రూ. 300 కోట్లు కేటాయించారు. ప్రైవేటు పరం జరుగుతున్నా.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు రూ. 683 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. మంగళగిరి, బీబీనగర్‌ ఎయిమ్స్‌తోసహా దేశంలోని 22 ఎయిమ్స్‌ ఆసుపత్రులకు రూ. 6,835 కోట్ల కేటాయింపులు జరిగాయి. సాలార్జంగ్‌ మ్యూజియంతోపాటు. దేశంలోని అన్ని మ్యూజియాల అభివృద్ధికి రూ. 357 కోట్లు, మణుగూరు, కోట భారజల కర్మాగారాలకు రూ. 1,473 కోట్లు, ఇంకాయిస్‌కి రూ. 27 కోట్లు దక్కాయి. ఇక కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా కింద రూ. 41,338 కోట్లు, తెలంగాణ వాటా రూ. 21,470 కోట్లు రానున్నాయి. వీటితోపాటు.. వివిధ పథకాలకు బడ్జెట్‌ కేటాయింపులతో తెలుగు రాష్ట్రాలకు కాస్త ఊరడింపే కానీ.. పెద్దగా లబ్ది చేకూరలేదన్నమాట వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

బడ్జెట్‌పై మండిపడిన బీఆర్ఎస్‌..

కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ బీఆర్‌ఎస్‌ ఎంపీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి పూర్తి అన్యాయం చేశారన్నారు. ఇది భారతదేశ బడ్జెట్‌, కేవలం కర్నాటక రాష్ట్రానికి మాత్రమే అన్నట్లుగా ఉందన్నారు. ముఖ్యంగా సప్తరంగాలంటూ అసలు రంగాలను వదిలేసిందని.. కేంద్ర బడ్జెట్‌ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్‌రావు. టీవీ9 బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా రైతులకు, కూలీలకు, పేదలకు వ్యతిరేకంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో అందమైన మాటలు తప్ప కేటాయింపుల్లేవన్నారు. మోటార్లకు మీటర్లపై తనదైన స్టయిల్‌లో సెటైర్లు విసిరారు హరీష్‌రావు. కేంద్రం ఫక్తు వ్యాపార ధోరణితో పనిచేస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న వారికి బెదిరింపులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

తెలంగాణ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేవని.. బయ్యారం స్టీల్‌, ఖాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, జిల్లాకో మెడికల్‌ కాలేజీ వంటి అంశాలపై ఒక్క ప్రకటనా లేదన్నారు. ఇది రైతు, పేదల, గ్రామీణ ప్రజల వ్యతిరేక బడ్జెట్ అని విమర్శించారు పలువురు బీఆర్ఎస్ ఎంపీలు.

ఏపీ నేతల రియాక్షన్స్ ఇవే..

మరోవైపు కేంద్ర బడ్జెట్‌ బాగుందంటూనే ఏపీ ఎంపీలు కొన్ని విషయాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే రుణానికి వడ్డీ చెల్లింపు పరిమితిని 50 ఏళ్లకు పెంచారని, ఇది అన్ని రాష్ట్రాలకు ఉపయోగకరంగా ఉందన్నారు ఏపీ ఆర్థికశాఖమంత్రి బుగ్గన. నర్సింగ్‌ కాలేజీల వల్ల కూడా అన్ని రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపులో అన్యాయం జరిగిందన్నారు. ఆక్వా రంగంలో రాయితీలు ఊరట ఇస్తున్నప్పటికీ.. ఇంకా ప్రోత్సహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ ఎంపీలు. అయితే బీఆర్ఎస్ విమర్శలను ఖండించింది బీజేపీ. బడ్జెట్‌ అనేది అంకెల గారడీ కాదని.. దేశ ఉజ్వల భవిష్యత్‌ అని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. మొత్తానికి ఇది ఊరడింపు బడ్జెట్టేనని ఏపీ.. ఉసూరు మనిపించే బడ్జెట్టని తెలంగాణ ఆరోపించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..