అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత ధివంగత నేత, మాజీ ప్రధాని పీవీ నరసింహరావుదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. పివి వర్దంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పివి ఘాట్ దగ్గర పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీకి దేశ అత్యున్న పౌరపురస్కారం భారతరత్న ఇచ్చి గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌కు పీవీ ఎంతో సేవ చేశారని.. అయితే ఆ పార్టీ పీవీకి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.ఢిల్లీలో పీవీ ఘాట్‌ను నిర్మించాలని కోరారు. పీవీ విషయంలో కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన డిమాండ్‌ను ఇప్పుడు కూడా అడుగుతున్నామని వ్యాఖ్యానించారు. పీవీ నరసింహా రావు ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
తెలుగువాడైన పీవీ నరసింహరావు దేశ 9వ ప్రధానిగా 1991 నుంచి 1996 వరకు సేవలందించారు. ఆయన ప్రభుత్వ హయాంలో దేశ ఆర్థిక రంగంలో పలు సంస్కరణలు చేపట్టారు. 2004 డిసెంబరు 23న ఢిల్లీలో పీవీ నరసింహరావు కన్నుమూశారు.
కేటీఆర్ ట్వీట్..
తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని శ్రీ పీవీ నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా.. పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS.. వారితో పలువురు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు నాయకులు ఉన్నారు. pic.twitter.com/90MUo7gy7r
— BRS Party (@BRSparty) December 23, 2023
కాగా గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాధించిన పురోగతిపై కేటీఆర్ ఆదివారంనాడు స్వేద పత్రం సమర్పించనున్నారు. ముందుగా శనివారం ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇవ్వాలని భావించినా.. దీన్ని ఆదివారంనాటికి వాయిదావేశారు. ఆదివారం ఉదయం 11 గం.లకు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ స్వేదపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ సర్కారు సమర్పిస్తున్న శ్వేతపత్రాలకు కౌంటర్‌గా బీఆర్ఎస్ ఈ స్వేద పత్రాన్ని రిలీజ్ చేయనుంది.
The Power Point Presentation (Swedha Pathram) to be given by BRS Party Working President @KTRBRS has been rescheduled to tomorrow (Sunday) at 11 AM, December 24th, 2023 at Telangana Bhavan.
— BRS Party (@BRSparty) December 23, 2023
పీవీ ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు..వీడియో