BRS Plan: ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై మారిన బీఆర్ఎస్ వ్యుహం.. సార్వత్రిక ఎన్నికలపైనే నజార్..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత భారత రాష్ట్ర సమితి రకరకాలుగా ఓటమిపై విశ్లేషణ చేసుకుంటుంది. కార్యకర్తలనుంచి అభిప్రాయాలను తీసుకుని.. వాటికి అనుకూలంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తోంది. రకరకాలుగా స్థానిక నేతలు కార్యకర్తలు ఓటమికి గల కారణాలను అధిష్టానం ముందు ఉంచుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత భారత రాష్ట్ర సమితి రకరకాలుగా ఓటమిపై విశ్లేషణ చేసుకుంటుంది. కార్యకర్తలనుంచి అభిప్రాయాలను తీసుకుని.. వాటికి అనుకూలంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాలని భావిస్తోంది. రకరకాలుగా స్థానిక నేతలు కార్యకర్తలు ఓటమికి గల కారణాలను అధిష్టానం ముందు ఉంచుతున్నారు. వరుసగా జరుగుతున్న పార్లమెంటు సమీక్ష సమావేశాల్లో ఒకరకంగా అధిష్టానాన్ని కార్యకర్తలు నిలదీస్తున్నట్లు కనిపిస్తోంది.
అందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చడం కూడా ఇబ్బంది కలిగించిందని చెప్పుకొచ్చారు కార్యకర్తలు. ప్రజలు తెలంగాణ పదాన్ని తొలగించడం అంగీకరించలేకపోయారని అంటున్నారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమ పార్టీ ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు సొంత రాష్ట్రంలో పార్టీని నిర్లక్ష్యం చేసిందని కొంతమంది కార్యకర్తలు నిర్మొహమాటంగా అధినాయకత్వం ముందే తమ బాధను వెళ్ళబోసుకున్నారట.
ఈ నేపథ్యంలో తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న బీఆర్ఎస్, ఇతర రాష్ట్రాలలో పోటీ గురించి మాత్రం మాట మాట్లాడటం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2022, 2023 సంవత్సరాల్లో మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. నాగ్‌పూర్, సోలాపూర్, నాందేడ్ ప్రాంతాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటు చేసి కార్యాలయాలు కూడా ప్రారంభించింది. నాలుగు బహిరంగ సభలు కూడా పెట్టారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ తోట చంద్రశేఖర్‌ను రాష్ట్ర అధ్యక్షునిగా నియమించి పార్టీని అక్కడ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.
మధ్యప్రదేశ్, కర్ణాటకలోనూ పార్టీని విస్తరించేందుకు ప్లాన్ చేశారు. జాతీయ పార్టీగా అవతరింప చేసేందుకు ఢిల్లీలోనూ సొంత కార్యాలయాన్ని నిర్మించారు. కానీ రాష్ట్రంలోనే అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో పూర్తి ఫోకస్ తెలంగాణలోనే పెట్టాలని బీఆర్ఎస్ అధి నాయకత్వం ఇప్పుడు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే మహారాష్ట్ర నుంచి కొంతమంది నేతలు తెలంగాణ భవన్‌కు వచ్చి వెళ్తున్న వారికి ఎలాంటి హామీ అధినేత నుంచి లభించడం లేదట. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతలు, ఒక్కొక్కరుగా టీడీపీ కండువా కప్పుకుంటున్నారట. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్ది అక్కడక్కడా ఉన్న ఇతర రాష్ట్ర కమిటీలు పోటీకి దూరంగా ఉంటే పార్టీలో కొనసాగుతారా లేదా అనేది తెలియని పరిస్థితి నెలకొంది.
నిజానికి ఇతర రాష్ట్రాల్లో పోటీపై అధినేత కేసీఆర్ కూడా ఎలాంటి సూచనలు ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో చేసిన ప్రయత్నాన్ని మధ్యలో వదిలేసినట్లేనా.. లేక ఇప్పుడు అధికారానికి దూరంగా ఉన్నారు కాబట్టి మొదట తెలంగాణపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారా..? పార్లమెంటు ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయా రాష్ట్రాల్లో యాక్టివ్ అవుతారా అనేది చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…