పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన MLAలపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు రెండు పిటిషన్లు వేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హతపై రిట్ పిటిషన్ దాఖలు చేసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్, కృష్ణమోహన్, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీపై రిట్ పిటిషన్ వేసిన బీఆర్ఎస్.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిపై మాజీమంత్రి హరీష్‌రావు ఢిల్లీ చేరుకుని న్యాయనిపుణులతో చర్చిస్తున్నారు.
తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో 10 మంది కాంగ్రెస్‌లో చేరారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై శాసనసభ సెక్రెటరీ హైకోర్ట్ ప్రత్యేక బెంచ్‌ని ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకరుకి ఉందని, టైమ్ బౌండ్ ఏమీ లేదని ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ అధిష్టానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీమంత్రి ప్రశాంత్ రెడ్డి. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో తనది కాంగ్రెస్ పార్టీ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పారని.. దీన్ని పరిగణనలోకి తీసుకుని స్పీకర్ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..