
మాజీ మంత్రి, ప్రస్తుత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్‌ను వీడి, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. నిన్న MLC పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి దంపతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుతం ఈ అంశం రంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. 2018 ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై తాండూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన పైలట్ రోహిత్‌రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆ తర్వాత జిల్లాలో మహేందర్‌రెడ్డి గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది. ఈ క్రమంలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీలో పట్నం దంపతులు చేరతారని కథనాలు వచ్చినా.. చివరి మూడు నెలల టైంలో మహేందర్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆ నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా.. వికారాబాద్‌జిల్లాలోని 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. దీంతో పట్నం దంపతులు పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి హస్తం గుర్తుపై ప్రస్తుత జడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి పోటీకి సీఎం రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ ఆఫర్‌తోనే పట్నం దంపతులు పార్టీ మారనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకొనున్నట్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది.
అయితే, పట్నం మహేందర్ రెడ్డి దంపతులు ఈనెల 11న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఎంపీ టికెట్ ఆఫర్ తోనే .. పట్నం దంపతులు పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..