తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వరుసబెట్టి కలుస్తుండటం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎన్నికల వేళ తాజా పరిణామాలు కాంగ్రెస్‌లో జోష్ నింపుతుండగా గులాబీ పార్టీలో గుబులు రేగుతోంది.
లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని వరుసగా కలుస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా చేవెళ్ల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అరగంటకుపైగా సమావేశం కొనసాగింది. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు విడుదల కోసం కలిసినట్లు ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు.
మార్చి 3వ తేదీన భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. మంత్రి పొంగులేటితో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కుటుంబ సమేతంగా కలిశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. కొంతకాలంగా వెంకట్రావు కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా నుంచి గెలిచిన ఏకైక BRS ఎమ్మెల్యే వెంకట్రావు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలంటూ వెంకట్రావ్ వినతిపత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత వెంకట్రావు సీఎంను కలవడం ఇది రెండోసారి. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ నిర్వహించిన ఖమ్మం బీఆర్ఎస్ నేతల మీటింగ్‌కి తెల్లం వెంకట్రావు డుమ్మా కొట్టారు. మార్చి 11వ తేదీన భద్రాచలంలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన సీఎం సమక్షంలో పార్టీ మారతారనే ప్రచారం జరుగుతుంది.
జనవరి నెలలో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు కలిసారు. ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి కోసమే తాము సీఎంను కలిశామని నలుగురు ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలుస్తున్నామని నేతలు పైకి చెబుతున్నా పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది.
ఫిబ్రవరి నెలలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునీత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి బీఆర్‌ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలోకి నేతల వలసలు కొనసాగుతున్నాయి. వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా రెండ్రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సుధారాణి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది.
అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వరుసగా సీఎం రేవంత్‌ను కలుస్తుండటంతో లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడొచ్చనే ఆందోళన బీఆర్‌ఎస్ నేతల్లో మొదలైందని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ద్వారా పట్టు నిలుపుకోవాలని సీఎం రేవంత్ యోచిస్తుండటంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సమావేశాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…