హైదరాబాద్, జనవరి 27: గవర్నర్ తమిళిసై ఆహ్వానం మేరకు రాజ్‌భవన్‌లో జరిగిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. చాలా కాలం తర్వాత గవర్నర్ ‘ఎట్ హోం’ లో రాజకీయ సందడి నెలకొంది. గత ప్రభుత్వంలో గవర్నర్‌కు – మాజీ సీఎం కేసీఆర్‌కు మధ్య ఉన్న దూరం వల్ల ‘ఎట్ హోం’ కు బీఆర్ఎస్ దూరం ఉంటూ వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇది మొదటి ‘ఎట్ హోం’ కాగా ఇందులో రాజకీయ సందడి కనిపించింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయతే ‘ఎట్ హోం’ కు గులాబీ పార్టీ మాత్రం దూరంగా ఉంది.
రాజ్ భవన్లో జరగిన ‘ఎట్ హోం’ కు బీఆర్ఎస్ నుండి ఒక్కరూ కూడా హాజరుకాలేదు. అయితే ఉదయమే గవర్నర్‌పై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎంపికపై కూడా గవర్నర్ మీద ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ట్విట్టర్ వేదికగా తమిళసై పై గరం అయ్యారు. పలు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఇదిలా ఉంటే రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ లో పలువురు బీజేపీ నేతలు కూడా కనిపించారు. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావుతో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు కనిపించారు. గవర్నర్ తండ్రి మాజీ ఎంపీ అనంతన్ కూడా ‘ఎట్ హోం’ లో పాల్గొన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. దీంతో మంత్రులు అంతా ఆయనతో ముచ్చటించి ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా అక్కడ ఆసక్తికర సంభాషణలు జరిగాయి. రాజ్ భవన్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..