AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR Meet BRS MPs: తెలంగాణ హక్కుల సాధన కోసం పార్లమెంటులో గళం విప్పాలి.. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్ధేశం

పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ తరపున బీఆర్ఎస్ దళం.. గళం విప్పాలని చెప్పారు గులాబీ బాస్ కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో తెలంగాణ హక్కులను పార్లమెంట్‌లో లేవనెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందవద్దని ఎంపీలకు సూచించారు.

KCR Meet BRS MPs: తెలంగాణ హక్కుల సాధన కోసం పార్లమెంటులో గళం విప్పాలి.. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్ధేశం
Kcr Kesav Rao
Balaraju Goud
|

Updated on: Jan 26, 2024 | 9:58 PM

Share

పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ తరపున బీఆర్ఎస్ దళం.. గళం విప్పాలని చెప్పారు గులాబీ బాస్ కేసీఆర్. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్లమెంటరీ పార్టీ భేటీలో తెలంగాణ హక్కులను పార్లమెంట్‌లో లేవనెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందవద్దని ఎంపీలకు సూచించారు.

ఎన్నికల తర్వాత పరిస్థితిని నిన్న మొన్నటి వరకు కేటీఆర్ సమీక్షలు చేస్తే, ఇప్పుడు కేసీఆర్‌ రంగంలోకి దిగారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత కోలుకున్న బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. గజ్వేల్ – ఎర్రవెల్లి ఫార్మ్ ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీకి ఎంపీలు, కేటీఆర్, హరీష్‌రావు హాజరయ్యారు.

ఇక జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని ఎంపీలతో చెప్పారు కేసీఆర్‌. పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ హక్కుల సాధన కోసం.. బీఆర్ఎస్ ఎంపీలంతా గళం విప్పాలని సూచించారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు, పెండింగ్‌ అంశాలపై పార్లమెంట్‌లో లేవనెత్తాలన్నారు. నాడైనా, నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని, కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆశలన్నీ బీఆర్ఎస్ వైపే ఉన్నాయన్న కేసీఆర్, అసెంబ్లీ ఫలితాలపై ఎవరూ నిరాశ చెందవద్దని సూచించారు. ఉభయసభల్లో పార్టీ తరఫున అనుసరించాల్సిన వైఖరి, వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

పెండింగ్‌ అంశాలతో పాటు.. తెలంగాణ సమస్యలపై పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని ప్రశ్నిస్తామన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. కృష్ణా బేసిన్‌లో జరుగుతున్న అన్యాయంపై పార్లమెంట్‌లో నిలదీస్తామన్నారు నామా. కృష్ణా బోర్డుకు మనప్రాజెక్ట్‌లు అప్పగించడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు హరీష్‌రావు. కృష్ణా జలాల్లో మన వాటా తెలియకుండా..బోర్డుకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు హరీష్‌రావు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ బలంగా ఉందన్న కేసీఆర్.. ఎవరితో సంబంధం లేకుండా గట్టిగా పోరాడుదామన్నారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వస్తానని తెలిపారు కేసీఆర్.

ఇదిలావుంటే, అసెంబ్లీ ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరగడంతో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే చేతికర్ర సాయంతో నడుస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్‌ శస్త్ర చికిత్స నుంచి మెల్లమెల్లగా కోలుకుంటూ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…