తెలంగాణ రాష్ట్రం సిద్ధించేలోపే.. కొందరు ఆత్మబలిదానాలు చేసుకున్నారు, క్షమించండి. ఇదీ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ప్రకటన. చేసిందంతా చేసి.. మా బిడ్డలను పొట్టనబెట్టుకుని.. ఇప్పుడు సింపుల్‌గా సారీ చెబుతున్నారా? షేమ్ షేమ్ అంటూ బీఆర్‌ఎస్ కౌంటర్స్ ఇస్తోంది. ఎన్నికల ప్రచారం పీక్స్‌కు చేరుకున్న వేళ.. కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి.. అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. సోనియాగాంధీ బర్త్‌డే గిఫ్ట్‌గా తెలంగాణ ఇచ్చేశారంటూ ఇక్కడి కాంగ్రెస్ నేతలు తెగ హడావుడి చేశారు. తెలంగాణ ఏర్పాటు జరిగిపోయింది. సీఎం సీటుని, మంత్రి పదవులను పంచుకోవడమే తరువాయి అన్న రేంజ్‌లో ప్రచారం జరిగింది. అటు తెలంగాణ ఉద్యమకారులు కూడా రాష్ట్రం సిద్ధించిందని పండగ చేసుకున్నారు. కాని.. కొన్నిరోజులకే ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం.
దీంతో 2009 నుంచి ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. మా రాష్ట్రం మాకు కావాలె అంటూ ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. దాదాపు 1200మంది తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఆ తర్వాత దిగొచ్చిన అధికార కాంగ్రెస్ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేసింది. ఇది చరిత్ర. దీనిపైనే తాజాగా ఓ ప్రకటన చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం. 2009 నుంచి 2014 మధ్య ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. అలా జరగకుండా ఉండాల్సిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో.. ఇక్కడ కూడా ప్రజా ఉద్యమం ద్వారానే తెలంగాణ ఏర్పడింది. ఉద్యమకాలంలో కొందరు ఆత్మబలిదానాలు చేసుకున్నారు దానికి క్షమాపణలు అడుగుతున్నామన్నారు.
చిదంబరం సారీ చెప్పడంపై బీఆర్‌ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. మంత్రులు కేటీ రామారావు, హరీష్ రావు.. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ సీనియర్ నేతను తప్పుబట్టారు. వందల మంది ప్రాణాలు కోల్పోడానికి కేవలం కాంగ్రెస్ విధానాలే కారణమన్నారు మంత్రి కేటీఆర్. మీ పార్టీ దీనికి బాధ్యత వహించాలన్నారు. అంతేకాదు.. ఇప్పుడు ఎన్ని సారీలు చెప్పినా.. పోయిన ప్రాణాలు తీసుకురాగలరా…? అసలు మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మరంటూ ఘాటుగా ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. తమపై కాంగ్రెస్ చేసిన దౌర్జన్యాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.
Too late and Too little Chidambaram Ji
Your party is solely responsible for taking the lives of hundreds of Telangana youngsters from 1952 – 2014
No matter how hard you try now, people of Telangana will always remember the brutalities Congress perpetrated on us https://t.co/ifUGOTAK93
— KTR (@KTRBRS) November 16, 2023
ఇక మంత్రి హరీష్ రావు అంతకు మించిన విమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ నేత చిదంబరం తీరు చూస్తుంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుగా ఉందన్నారు. ఆనాడు పొట్టి శ్రీరాములు మరణానికి కాంగ్రెస్సే కారణమని, ఆతర్వాత తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకూ వారేకారణమన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారని విమర్శించారు. తెలంగాణ సాధించింది కేసీఆర్, సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మోడల్‌గా నిలిపింది కేసీఆర్.. మళ్లీ తెలంగాణలో వచ్చేది కూడా కేసీఆర్ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు హరీష్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…