రోజుకో రాష్ట్రం.. దేశంలో విస్తరించే వ్యూహం.. ఇదే బీఆర్‌ఎస్ స్ట్రాటజీగా కనిపిస్తోంది. పాగా కోసం వ్యూహాత్మకంగా సభలు, సమావేశాలు, చేరికలతో హీట్ పుట్టిస్తోంది. బీజేపీ టార్గెట్‌గా బీఆర్‌ఎస్ అడుగులు ఏమేరకు ఫలిస్తాయి? ఇప్పుడిదే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చాక జాతీయస్థాయిలో దూకుడుగా ముందుకెళ్తున్నారు సీఎం కేసీఆర్. పార్టీ విస్తరణ కార్యక్రమాలను స్పీడప్ చేశారు. ఇందులో భాగంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో పోటీ చేయాలని భావిస్తున్నారు. ప్రత్యేక కార్యాచరణతో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు.
అన్ని చోట్లా పోటీ చేసే వ్యూహంతో కాకుండా తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న చోట పోటీ చేసి.. ఓట్లు, సీట్లు సాధించాలన్న లక్ష్యంతో బీఆర్‌ఎస్ ముందుకెళ్తున్నట్టు స్పష్టమవుతోంది. ముందుగా సరిహద్దు రాష్ట్రాల్లో అనుకూల పరిస్థితిని క్రియేట్ చేసి ఆ తర్వాత పట్టు, పాగా కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్న తెలుగువారి వివరాలను సేకరించింది. అభ్యర్థులను సన్నద్ధం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
ఏపీ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గ్రాండ్‌గా సభలు నిర్వహించింది బీఆర్‌ఎస్. నెక్స్ట్ టార్గెట్ కర్నాటకేనని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల తర్వాత కర్ణాటకలో ఎక్కువ మంది తెలుగువాళ్లు ఉన్నట్లుగా బీఆర్ఎస్ సమాచారం సేకరించింది. కర్ణాటక జనాభాలో దాదాపు 15 శాతం మంది తెలుగు మాట్లాడే వాళ్లు ఉన్నారని.. 12 జిల్లాల్లో తెలుగువాళ్లు కీలకంగా ఉన్నారని బీఆర్ఎస్ గుర్తించింది. దీంతో ఆ స్థానాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. ఇక మహారాష్ట్రలో 22 శాసనసభ 8 పార్లమెంటు.. ఛత్తీస్‌గఢ్‌లో 3 ఎంపీ, 12 శాసనసభ స్థానాల్లో తెలుగు వాళ్ల ప్రభావం ఉంటుందని గుర్తించింది. ముందుగా ఆ స్థానాలపై గట్టిగా పట్టు సాధించాలని భావిస్తోంది. ఇక వేదిక ఎక్కడైనా.. సందర్భం ఏదైనా బీజేపీ విధానాలను ఎండగుడుతూనే ఉన్నారు సీఎం కేసీఆర్. కేవలం రాజకీయ విమర్శలే కాకుండా భారీ రిజర్వాయర్ల నిర్మాణం గురించి కేంద్రం ఎందుకు ఆలోచన చేయడం లేదని ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
మరోవైపు బీఆర్‌ఎస్ టార్గెట్‌గా బీజేపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై హాట్ కామెంట్స్ చేశారు ఆ పార్టీ నేత బూర నర్సయ్యగౌడ్. అసెంబ్లీలో కేటీఆర్ స్పీచ్, నాందేడ్‌లో కేసీఆర్ ప్రసంగంపై సెటైర్లు వేశారు.
పార్టీల మధ్య విమర్శలు ఎలా ఉన్నా.. వేర్వేరు రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరికలు ఊపందుకుంటున్నాయి. అదే స్పీడ్ ముందు ముందు కొనసాగితే దేశవ్యాప్తంగా పార్టీ గురించి చర్చ కొనసాగడం ఖాయం. మొత్తానికి తెలంగాణ మోడల్‌ను ప్రమోట్ చేస్తూనే.. వచ్చే లోక్‌సభ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు సీఎం కేసీఆర్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..