
‘‘కేసీఆర్ చావాలని కొందరు శాపనార్థాలు పెడుతున్నారు. కానీ, మీరు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. పిల్లి శాపాలకు నేను చస్తానా? నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ నేల కోసమే పనిచేస్తాను’’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో జీవన్ రెడ్డికి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలతో పాటు తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తు చేసుకున్నారు. ‘‘జీవన్‌రెడ్డితో నాకు 45 ఏళ్ల స్నేహం ఉంది. ఆయన కేవలం జగిత్యాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలోకి వచ్చారు. ఆయనను బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో గెలిచాక, ఆయనకు రాష్ట్ర స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగిస్తాను. ఇది నా మాట.. కేసీఆర్ మాట ఇస్తే తప్పడు. జగిత్యాలను కార్యకర్తలు చూసుకోవాలని, తెలంగాణను నేను, జీవన్‌రెడ్డి చూసుకుంటాం’’ అని కేసీఆర్ అన్నారు.
కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘‘కాంగ్రెస్ వస్తే రైతుబంధుకు రాంరాం, దళితబంధుకు జై భీమ్ అంటారని ముందే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ఒక్కసారి వేయాల్సిన రైతుబంధును విడతలవారీగా వేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బీఆర్ఎస్ సభ వల్లే ఇవాళ రెండో విడత రైతు బంధు నిధులు విడుదల చేశారు. మూడో విడత వేయాలంటే మళ్లీ సభ పెట్టాలా’’ అంటూ ఎద్దేవా చేశారు. యూరియా కోసం రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోయారన్న బీఆర్ఎస్ చీఫ్.. మరోసారి ఆ తప్పు చేయొద్దు అని సూచించారు. వందకు వంద శాతం మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే వస్తుందని, అభివృద్ధిని కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
హైడ్రాపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల ఇళ్లను కూల్చడానికే హైడ్రా తెచ్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తేస్తామన్న ఆయన.. మొదటి సంతకం ఆ ఫైల్‌పైనే పెడతానని స్పష్టం చేశారు. మూసీ నది బాగుచేయాలంటే పదివేల ఇళ్లు కూల్చాలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ వల్ల అన్ని వర్గాల జీవితాలు ఆగమయ్యాయన్నారు. కాంగ్రెస్ పోవాలి.. బీఆర్ఎస్ రావాలి అంటూ పిలుపునిచ్చారు.