
అప్పు కట్టలేదని సొంత చెల్లెలి ఇంటికి అన్న తాళం వేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. శివంపేట మండలం దొంతి గ్రామంలో అప్పు కట్టలేదని తన సోదరి గీత ఇంటికి తాళం వేసాడు అన్న బాల నరసయ్య. దొంతి గ్రామంలో నివాసం ఉండే గోత్రాల గణేష్, గీత దంపతులు 5 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణానికై.. గీత అన్న వద్ద 1,50,000 అప్పు తీసుకున్నారు. కాగా వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఈ నెల 17న మస్కట్ వెళదామనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గీత అన్న బాల నరసయ్య, వదిన లక్ష్మీ దొంతి గ్రామానికి చేరుకొని గొడవకు దిగారు.
మాట మాట పెరిగి బావ గణేష్‌పై చేయి చేసుకున్నాడు బాలనరసయ్య.. డబ్బు కట్టేంతవరకు ఎక్కడికి వెళ్లొద్దని గొడవకు దిగడంతో మనస్తాపం చెందిన గణేష్ ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఆపై బాలనరసయ్య, లక్ష్మీ దంపతులు.. గీతను డబ్బుల విషయమై నిలదీసి ఇంట్లో నుంచి బయటకు గెంటేసి తాళం వేసుకున్నారు. ఇరుగుపొరుగు వారు ఎంత నచ్చ చెప్పిన వినకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది గీత.
రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఎంత నచ్చజెప్పినా బాల నరసయ్య దంపతులు వినకపోవడంతో పోలీస్ స్టేషన్‌కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. డబ్బుల విషయమై తన సొంత అన్ననే తనను ఇంట్లో నుండి బయటకు గెంటి తాళం వేయడం, తన భర్త సైతం సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోవడంతో ఆందోళన చెందుతుంది బాధితురాలు గీత. ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే మానవ సంబంధాలు మంట కలిసిపోతున్నాయి అని అనిపిస్తుంది.
చెల్లె సంతోషం కోసం అన్నలు సర్వాస్వాన్ని ఇచ్చేసే రోజులు పోయాయ్.. ఇప్పుడు జమానాలో పైసా కోసం సొంత వారినే హింసించే అవసరం అయితే అంతమొందించే రోజుల వచ్చాయని జనం చర్చించుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.