బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ హెచ్చరిక!

Matangi Anuradha Bonalu Bhavishyavani: బోనాల జాతరలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఆచార సంప్రదాయాలను వీడితే అనర్థాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. తన పిల్లలను కాపాడుకుంటానని చెప్పారు.

బోనాల జాతరలో అమ్మవారి భవిష్యవాణి.. ఆచారాలను వీడితే అనర్థాలే అంటూ హెచ్చరిక!
Matangi Anuradha

Updated on: Aug 10, 2026 | 4:06 PM

Hyderabad Bonalu Uppuguda: తెలంగాణలో బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా సమాజంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

ఆచారాలను వీడితే అనర్థాలే?

సమాజంలో పుణ్యం తగ్గిపోతూ పాపం పెరిగిపోతోందని మాతంగి అనురాధ హెచ్చరించారు. ప్రజలు తమ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. తప్పులను సరిదిద్దుకోకుండా పాపాలు పెరిగితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదం ఉందని, కుండపోత వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భవిష్యవాణి వినిపించారు. తప్పులు దిద్దుకోకపోతే వర్షాలు, వరదల్లో మునిగిపోతారని హెచ్చరించారు.

ప్రజలు భక్తి మార్గంలో నడుస్తున్నామని భావిస్తూ కొన్నిసార్లు మూఢనమ్మకాల వెంట వెళ్తున్నారని అన్నారు. అమ్మవారి పేరును అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న పనులతో తనను బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన భక్తి అంటే సంప్రదాయాలను గౌరవించడం, పెద్దల మాటలను పాటించడం, ధర్మబద్ధంగా జీవించడమని సూచించారు.

ఇవి కూడా చదవండి

తప్పులు చేసినా.. పిల్లలను కాపాడుతానంటూ..

తప్పు చేసిన వారిని తాను శిక్షిస్తానని, అయితే వారు ఎంత తప్పు చేసినా తన పిల్లలేనని భావించి కాపాడుకుంటానని మాతంగి అనురాధ పేర్కొన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచే వారికి ఆమె కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. భక్తులు అమ్మవారిని ఎంత భక్తితో, గొప్పగా కొలిస్తే అంత సంతోషంగా ఉంటానని, నిజమైన మనసుతో కోరుకున్న కోరికలను నెరవేర్చి ప్రజలను చల్లగా చూస్తానని భవిష్యవాణిలో పేర్కొన్నారు.

బోనాల జాతరలో రంగం కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుంది. అమ్మవారి భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వాసంతో ఆలకిస్తూ, తమ జీవితాల్లో ధర్మం, సంప్రదాయాలు, భక్తికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us