బొల్లారం ఆర్మీ వెపన్స్ చోరి కేసులో కీలక అప్డేట్.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు!
బొల్లారం ఆర్మరీ చోరీ కేసులో ఇన్‌సైడర్ యాంగిల్ కీలకంగా మారింది. మాజీ హవిల్దార్ మల్లేష్‌తో నలుగురు ఆర్మీ సిబ్బంది టచ్‌లో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం. గార్డ్ డ్యూటీలు, ఆయుధాగారం భద్రత, సీసీటీవీల పనితీరుపై మల్లేష్‌కు లోపలి సమాచారం అందిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతి రాత్రి 8 గంటలకు సీసీటీవీలు ఆఫ్ అవుతాయన్న సమాచారం, ఆదివారాల్లో గార్డుల కదలికలు తక్కువగా ఉంటాయన్న విషయం ముందుగానే మల్లేష్‌కు తెలిసిందా? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ సమాచారంతోనే ఆగస్టు 30 రాత్రి చోరీకి ప్లాన్ చేసినట్లు మల్లేష్ వాంగ్మూలంలో వెల్లడైనట్లు పోలీసులు చెబుతున్నారు.

బొల్లారం ఆర్మరీ చోరీ కేసులో ఇన్‌సైడర్ యాంగిల్ కీలకంగా మారింది. చోరీ జరిగిన రాత్రి సుమారు 10 గంటలకు మల్లేష్ ఆయుధాగారం వద్దకు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆర్మరీ, మ్యాగజైన్ లాక్‌లను పగలగొట్టేందుకు యాప్రాల్‌లో రోడ్డుపక్కన వ్యాపారి వద్ద రూ.150కు ఇనుప రాడ్ కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. లాక్‌లు పగలగొట్టి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని గోనె సంచుల్లో ప్యాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఆపరేషన్‌కు సుమారు 90 నిమిషాల సమయం పట్టిందని మల్లేష్ చెప్పినట్లు సమాచారం. అనంతరం స్కూటర్‌పై ఆయుధాలను తరలించినట్లు, మిలిటరీ ప్రాంగణంలోకి బయటికి రెండుసార్లు వెళ్లినట్లు దర్యాప్తులో తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.
చోరీ చేసిన ఆయుధాల్లో 9ఎంఎం పిస్టల్, 10 లైవ్ రౌండ్ల మ్యాగజైన్‌ను మల్లేష్ తన అద్దె ఇంట్లో ఉంచినట్లు పోలీసులు వెల్లడించారు. రాబోయే కొనుగోలుదారులకు చూపించేందుకే వాటిని ఇంట్లో ఉంచినట్లు మల్లేష్ చెప్పినట్లు సమాచారం. మిగిలిన ఆయుధాలను అచ్చంపేటలోని తన తండ్రి ఇంటి ఆవరణలో భూమిలో పూడ్చిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. మల్లేష్ ఇచ్చిన సమాచారంతో నాలుగు AK-206 రైఫిళ్లు, ఒక INSAS రైఫిల్, ఆరు పిస్టళ్లు, మందుగుండు సామగ్రిని పోలీసులు రికవరీ చేసినట్లు తెలిపారు.
అయితే ఇంత భారీ స్థాయిలో ఆర్మరీ చోరీని మల్లేష్ ఒంటరిగా చేయడం సాధ్యమేనా? అనే అనుమానం పోలీసుల్లో నెలకొంది. చోరీకి ముందు మల్లేష్ నలుగురు మాజీ సహచరులతో సంప్రదింపులు జరిపినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ నలుగురు సిబ్బంది పాత్రపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఆయుధాల కొనుగోలుదారుల నెట్‌వర్క్ ఉందా? సోషల్ మీడియా ద్వారా మల్లేష్ ఆయుధాల కొనుగోలుదారుల కోసం సంప్రదింపులు జరిపాడా? అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది. యాంటీ సోషల్ ఎలిమెంట్స్‌కు అధునాతన ఆయుధాల డిమాండ్‌పై సమాచారం సేకరించాడా? ఆయుధాలను విక్రయించి డబ్బు సంపాదించాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాలపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
మల్లేష్ 16 ఏళ్ల సర్వీస్ అనంతరం జూన్ 30న డిశ్చార్జ్ అయ్యాడు. మరో మూడేళ్లు సర్వీస్ చేయాలనుకున్న మల్లేష్‌కు డిశ్చార్జ్‌పై అసంతృప్తి ఉందా? ఉన్నతాధికారులపై పగతోనే చోరీకి ప్లాన్ చేశాడా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. చోరీ చేసిన ఆయుధాలను విక్రయించి కోల్పోయిన మూడేళ్ల సర్వీస్ ఆదాయాన్ని భర్తీ చేసుకోవాలని భావించినట్లు సమాచారం. సెప్టెంబర్ 11న మల్లేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 22న చంచల్‌గూడ జైలు నుంచి మల్కాజ్‌గిరి పోలీసులు అతడిని కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కస్టడీలో మల్లేష్‌ను ఇతరుల ప్రమేయం, ఆయుధాల కొనుగోలుదారులతో సంబంధాలు, చోరీకి ముందు జరిగిన సంప్రదింపులపై ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. మల్లేష్‌తో పాటు మరికొందరు అనుమానితులను కూడా పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
